*నాబార్డ్ సహకారంతో డెయిరీ అభివృద్ధి చేసుకోవాలి*
*నాబార్డ్ డీజీఎం శ్రీకాంత్ బాంబర్*
*చిలుకూరు సెప్టెంబర్ 28(ప్రజావాణి)*: నాబార్డ్ సహకారాన్ని సద్వినియోగం చేసుకుని భానుపురి డెయిరీని అభివృద్ధి చేసుకోవాలని నాబార్డ్ డిప్యూటీ జనరల్ మేనేజర్ శ్రీకాంత్ బాంబర్ సూచించారు. సోమవారం భానుపురి రైతు ఉత్పత్తిదారుల కంపెనీ కార్యాలయాన్ని సందర్శించిన ఆయన బోర్డు ఆఫ్ డైరెక్టర్లతో సమావేశమై మాట్లాడారు.
డెయిరీ వ్యాపారంతో పాటు ఇతర ఆదాయాభివృద్ధి కార్యక్రమాలను చేపట్టాలని సూచించారు. నాబార్డ్ నుంచి ఐదేళ్ల వరకు అవసరమైన సహకారం అందిస్తామని, అనంతరం సంస్థ స్వయం సమృద్ధి సాధించేలా ప్రణాళికలు రూపొందించుకోవాలని తెలిపారు. భానుపురి ఎఫ్‌పీఓ సేవా దృక్పథంతో రైతుల ప్రయోజనాలకు అనుగుణంగా పనిచేయాలని సూచించారు.
సూర్యాపేట నాబార్డ్ జిల్లా అభివృద్ధి అధికారి రవీంద్ర నాయక్ మాట్లాడుతూ నాబార్డ్ సూచించిన అంశాలను పరిగణనలోకి తీసుకుని కార్యక్రమాలను అమలు చేయాలని, అవసరమైన మేరకు సహకారం అందిస్తామని తెలిపారు. మండల పశువైద్యాధికారి వీరారెడ్డి మాట్లాడుతూ భానుపురి డెయిరీ అభివృద్ధికి తమ వంతు సహకారం అందిస్తామని పేర్కొన్నారు
.ఈ కార్యక్రమంలో ఎఫ్‌పీఓ నిర్వహణ సంస్థ ఇంటిగ్రేటెడ్ రూరల్ డెవలప్‌మెంట్ సొసైటీ అధ్యక్షుడు వాడపల్లి రమేష్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ నంద్యాల అఖిల్, చైర్మన్ కే. రాము నాగేశ్వరరావు, రమణ, సతీష్, శిరీష, ప్రభాకర్, ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు.

