పుట్టపహాడ్ భౌతికశాస్త్ర ఉపాధ్యాయుడు ఎం. ఆంజనేయులుకు ‘జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ’ పురస్కారం
పరిగి, సెప్టెంబర్ 26 (ప్రజావాణి)
కులకచర్ల మండలం పుట్టపహాడ్ గ్రామంలో
విద్యాబోధనలో అంకితభావం, విద్యార్థుల ప్రగతి పట్ల నిరంతర తపన కనబరుస్తున్న పుట్టపహాడ్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల భౌతికశాస్త్ర ఉపాధ్యాయుడు శ్రీ ఎం. ఆంజనేయులు జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు–2026కు ఎంపికయ్యారు. ఈ ప్రకటన పట్ల పాఠశాల ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు, గ్రామస్తులు హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు.
సమయపాలన, నిబద్ధతకు నిలువెత్తు నిదర్శనం:
గత నాలుగేళ్లుగా ఒక్క రోజు కూడా సెలవు తీసుకోకుండా 100 శాతం హాజరుతో విధులు నిర్వహిస్తూ ఆంజనేయులు తోటి ఉపాధ్యాయులకు, విద్యార్థులకు ఆదర్శంగా నిలిచారు. ప్రతిరోజూ ఉదయం 8 గంటలకే పాఠశాలకు చేరుకుని, పదో తరగతి విద్యార్థులతో పాటు (ఎన్‌ఎంఎంఎస్) పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి ప్రత్యేక శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు. చదువులో వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారిస్తూ వారిలో ఆత్మవిశ్వాసాన్ని నింపుతున్నారు. శాస్త్రీయ దృక్పథం, వ్యక్తిత్వ వికాసం, పాఠశాల–సమాజ అనుసంధానంలో ఆయన చూపుతున్న చొరవ ప్రశంసనీయం.
పాఠశాల అభివృద్ధిలో భాగస్వామ్యం:
విద్యాబోధనకే పరిమితం కాకుండా పాఠశాల మౌలిక వసతుల కల్పనలోనూ ఆయన తనవంతు తోడ్పాటు అందించారు. తన తండ్రి జ్ఞాపకార్థం పాఠశాల ఆవరణలో సొంత నిధులతో అసెంబ్లీ డయాస్ (వేదిక) నిర్మించి సేవాభావాన్ని చాటుకున్నారు.
హర్షం వ్యక్తం చేసిన గ్రామస్తులు, ఉపాధ్యాయులు:
ఆంజనేయులు జిల్లా ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎంపిక కావడంపై పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ మహేంద్ర బహుదూర్, ఉపాధ్యాయులు, విద్యార్థులు, అమ్మ ఆదర్శ పాఠశాల చైర్మన్, సభ్యులు, గ్రామ పెద్దలు మరియు తల్లిదండ్రులు ఘనంగా అభినందనలు తెలిపారు. ఈ పురస్కారం పుట్టపహాడ్ పాఠశాలకే కాక మొత్తం గ్రామానికే గర్వకారణమని కొనియాడారు. భవిష్యత్తులో ఆయన మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు.

