📄 ePaper
Epaper 2
Wednesday, September 30, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణKhammamపట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదుపై ప్రత్యేక దృష్టి పెట్టాలి

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదుపై ప్రత్యేక దృష్టి పెట్టాలి

📰 Generate e-Paper Clip

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదుపై ప్రత్యేక దృష్టి పెట్టాలి….!. జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్

ఖమ్మం బ్యూరో ప్రతినిధి మన ప్రజావాణి

వరంగల్–ఖమ్మం–నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఓటరు నమోదు, జాబితా తయారీపై ప్రత్యేక దృష్టి సారించి, అర్హులైన ప్రతి పట్టభద్రుడిని ఓటరుగా నమోదు చేయాలని జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ అధికారులను ఆదేశించారు.

బుధవారం కలెక్టరేట్‌లో వరంగల్–ఖమ్మం– నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదు, జాబితా తయారీ, ఎస్‌ఐఆర్ ప్రక్రియపై వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టర్లు డాక్టర్ పి. శ్రీజ, పి. శ్రీనివాస రెడ్డి లతో కలిసి సమావేశం నిర్వహించారు.

జిల్లాకలెక్టర్ దివాకర టిఎస్ మాట్లాడుతూ ఎస్‌ఐఆర్ ప్రక్రియలో 1,75,858 అనామలీస్, నో మ్యాపింగ్ ఓటర్లు గుర్తించగా, వారిలో 1,69,802 మందికి నోటీసులు అందజేశామని, 1,36,208 మంది ఓటర్ల హియరింగ్ పూర్తి చేశామని తెలిపారు.

పెండింగ్‌లో ఉన్న 5,460 ఫారం-6, 1,172 ఫారం-7 దరఖాస్తులు, 9,087 ఫారం-8 దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.
ఎస్‌ఐఆర్ ప్రక్రియలో అభ్యంతరాల సమర్పణకు అక్టోబర్ 7 చివరి తేదీ అని, నవంబర్ 5 వరకు నోటీసుల ప్రక్రియ, అభ్యంతరాల పరిష్కారం అనంతరం నవంబర్ 9న తుది ఎస్‌ఐఆర్ జాబితా ప్రచురించే ప్రక్రియ ఉంటుందని తెలిపారు.
వరంగల్–ఖమ్మం–నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కోసం ప్రతి ఎన్నికల సమయంలో పట్టభద్రులు తప్పనిసరిగా తాజాగా ఎమ్మెల్సీ ఓటరుగా నమోదు చేసుకోవాల్సి ఉంటుందని కలెక్టర్ తెలిపారు.

తేది: 31-10-2023 నాటికి పట్టభద్రులైన అర్హులు, 01-11-2026ను అర్హత తేదీగా తీసుకొని రూపొందించే ఎమ్మెల్సీ ఓటరు జాబితాలో తమ పేరును నమోదు చేసుకోవాలని సూచించారు. అర్హత కలిగిన పట్టభద్రులు ఫారం-18ను పట్టభద్రత ధ్రువీకరణ పత్రంతో సంబంధిత ఈఆర్‌ఓ, ఆర్డీఓ కార్యాలయంలో లేదా ఆన్‌లైన్‌లో కూడా దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు.
గతంలో ఖమ్మం జిల్లాలో సుమారు 84 వేల మంది పట్టభద్రులు మాత్రమే ఎమ్మెల్సీ ఓటర్లుగా నమోదు అయ్యారని, ఈసారి కనీసం 2 లక్షల మంది పట్టభద్రులను ఎమ్మెల్సీ ఓటర్లుగా నమోదు చేయడమే లక్ష్యంగా అధికారులు పనిచేయాలని కలెక్టర్ సూచించారు.

ప్రతి గ్రామంలో ప్రత్యేక గ్రామసభలు, పట్టణాల్లో వార్డు సభలు నిర్వహించి ఎమ్మెల్సీ ఓటరు నమోదుపై విస్తృత అవగాహన కల్పించాలని ఆదేశించారు. టామ్‌టామ్ ద్వారా ప్రచారం నిర్వహించడంతో పాటు ప్రత్యేక పోస్టర్లు, అవగాహన వీడియోలు రూపొందించి ప్రజలకు చేరేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు.
జిల్లాలోని ప్రతి డిగ్రీ, ప్రొఫెషనల్, పీజీ కళాశాలలో ప్రత్యేక ప్రచార దినోత్సవం నిర్వహించి కళాశాల నుండి గ్రాడ్యుయేట్ పూర్తి చేసిన వారి వివరాలు తీసుకొని, అర్హులైన పట్టభద్రులను ఎమ్మెల్సీ ఓటర్లుగా నమోదు చేయాలని కలెక్టర్ సూచించారు.

ప్రతి మండలంలో మొత్తం ఓటర్ల జాబితాను పరిశీలించి, 25 నుంచి 60 సంవత్సరాల వయస్సు గల ఓటర్లలో పట్టభద్రులైన వారిని గుర్తించి, అర్హులైన ప్రతి ఒక్కరినీ ఎమ్మెల్సీ ఓటరుగా నమోదు చేయడాన్ని లక్ష్యంగా పెట్టుకోవాలని తెలిపారు.

ఎమ్మెల్సీ ఓటరు నమోదు ప్రక్రియలో బూత్ లెవల్ ఏజెంట్లు (బీఎల్‌ఏలు) కూడా చురుకుగా భాగస్వాములు కావాలని కలెక్టర్ సూచించారు. రాజకీయ పార్టీల ప్రతినిధులు తమ పరిధిలోని అర్హులైన పట్టభద్రులను గుర్తించి ఓటరుగా నమోదు చేసుకునేలా సహకరించాలని కోరారు.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొదటి ప్రాధాన్యత, రెండో ప్రాధాన్యత ఓటు తదితర అంశాలపై ఓటర్లకు పూర్తి అవగాహన కల్పించాలని కలెక్టర్ తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎలా ఓటు వేయాలి, ప్రాధాన్యతా ఓటు విధానం ఎలా ఉంటుంది అనే అంశాలపై అవసరమైన అవగాహన వీడియోలను రూపొందించి విస్తృతంగా ప్రచారం చేయాలని సూచించారు.

వరంగల్–ఖమ్మం–నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గానికి సంబంధించి 01-11-2026ను అర్హత తేదీగా తీసుకొని ఓటరు జాబితా తయారీ ప్రక్రియ కొనసాగుతుందని తెలిపారు.

ఓటర్ జాబితా నమోదు నోటిఫికేషన్ 28-09-2026న, మొదటి పునఃప్రచురణ 15-10-2026న, రెండో పునఃప్రచురణ 25-10-2026న జరుగుతుందని తెలిపారు.

ఫారం-18 దరఖాస్తుల స్వీకరణకు 06-11-2026 చివరి తేదీ అని పేర్కొన్నారు.
డ్రాఫ్ట్ ఓటరు జాబితా ముద్రణ 20-11-2026 నాటికి పూర్తి చేసి, 25-11-2026న డ్రాఫ్ట్ ఓటరు జాబితాను ప్రచురిస్తామని తెలిపారు.

క్లెయిమ్స్, అభ్యంతరాలను 25-11-2026 నుంచి 10-12-2026 వరకు స్వీకరిస్తామని, వాటిని 25-12-2026 లోపు పరిష్కరించి, 30-12-2026న తుది ఓటరు జాబితాను ప్రచురించేలా చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు.

ఎమ్మెల్సీ ఓటరు నమోదు, జాబితా విజయవంతం చేసేందుకు అన్ని శాఖల అధికారులు, రాజకీయ పార్టీల ప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ సూచించారు.

ఈ సమావేశంలో ఖమ్మం మున్సిపల్ కమిషనర్ అభిషేక్ అగస్త్య, ఎస్‌డీసీ సదానందం, ఆర్డీఓ శ్రీనివాస్, ఎన్నికల విభాగ డిటి అన్సారీ, బీఆర్ఎస్ పార్టీ ప్రతినిధి బెల్లం వేణుగోపాల్, బీఆర్ ఎస్ వి ప్రతినిధి ఎల్. సతీష్ బాబు, సీపీఎం పార్టీ ప్రతినిధులు డి. తిరుపతి రావు, ఆర్. ప్రకాష్, ఐఎన్ సి పార్టీ ప్రతినిధులు అన్నెం గోపాల్ రావు, జి. సూర్యనారాయణ, బీఎస్పీ పార్టీ ప్రతినిధి వేల్పుల రామయ్య, బిజెపి పార్టీ ప్రతినిధి వి. రాజేష్, ఆమ్ ఆద్మీ పార్టీ ప్రతినిధి స్వర్ణ సుబ్బారావు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.