నర్సాపూర్‌లో 22/ఏ భూములపై బీజేపీ ధర్నా
నిషేధిత జాబితాలోని భూముల వివరాలను బహిర్గతం చేయాలని డిమాండ్
నర్సాపూర్: 22/ఏ నిషేధిత జాబితాలో ఉన్న భూముల పూర్తి వివరాలను ప్రభుత్వం వెంటనే ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని డిమాండ్ చేస్తూ బీజేపీ ఆధ్వర్యంలో నర్సాపూర్‌లో ధర్నా నిర్వహించారు. బీజేపీ మెదక్ జిల్లా అధ్యక్షుడు వాల్దాస్ రాధామల్లేష్ గౌడ్ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ ఆందోళన కార్యక్రమానికి మెదక్ ఎంపీ రఘునందన్ రావు, చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి, మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ ముఖ్య అతిథులుగా హాజరై ఆందోళనకు మద్దతు తెలిపారు.
ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ 22/ఏ నిషేధిత జాబితాలో ఉన్న భూములపై ప్రజల్లో అనేక అనుమానాలు, ఆందోళనలు నెలకొన్నాయని తెలిపారు. నిషేధిత జాబితాలో ఏయే భూములు ఉన్నాయి, వాటి విస్తీర్ణం ఎంత, వాటికి సంబంధించిన పూర్తి వివరాలను ప్రభుత్వం పారదర్శకంగా వెల్లడించాలని డిమాండ్ చేశారు. భూముల వివరాలను దాచిపెట్టకుండా ప్రజలకు స్పష్టమైన సమాచారం అందించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు.
22/ఏ జాబితాలో ఉన్న భూముల్లో అర్హులైన పేదలకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని బీజేపీ నాయకులు కోరారు. ఎన్నో ఏళ్లుగా భూములపై ఆధారపడి జీవిస్తున్న పేదలు, రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. నిషేధిత భూముల వ్యవహారంలో పూర్తి స్థాయి పరిశీలన జరిపి అర్హులైన వారికి భూములు అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ప్రజలకు సంబంధించిన భూముల విషయంలో ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరించాలని, 22/ఏ భూములపై పూర్తి సమాచారాన్ని బహిర్గతం చేసి ప్రజల అనుమానాలను నివృత్తి చేయాలని నాయకులు అన్నారు. భూముల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపే వరకు బీజేపీ ప్రజల తరఫున పోరాటం కొనసాగిస్తుందని స్పష్టం చేశారు.
ఈ ధర్నా కార్యక్రమంలో బీజేపీ ఎస్టీ మోర్చా మెదక్ జిల్లా అధ్యక్షుడు లావుడియా రాములు నాయక్‌తో పాటు పార్టీ నాయకులు, ఎస్టీ మోర్చా నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

