ఘట్కేసర్, సెప్టెంబర్ 16 (ప్రజావాణి): తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం భూస్వామ్య, నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా సాగిన గొప్ప ప్రజా ఉద్యమాలలో ఒకటని సీపీఐ సీనియర్ నాయకులు, కె.ఎల్. మహేంద్రనగర్ కాలనీ వ్యవస్థాపకులు టి. మల్కయ్య అన్నారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాల్లో భాగంగా సీపీఐ ఘట్కేసర్ మండల సమితి ఆధ్వర్యంలో అన్నోజిగూడలోని కె.ఎల్. మహేంద్రనగర్ వికలాంగుల కాలనీలో ర్యాలీ నిర్వహించి, కె.ఎల్. మహేంద్ర చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా టి. మల్కయ్య మాట్లాడుతూ.. నిజాం నిరంకుశ పాలన, జమీందారీ–దొరల దోపిడీ, వెట్టిచాకిరీ, భూమిపై పెత్తందారీకి వ్యతిరేకంగా రైతులు, కూలీలు, పేద ప్రజలు కమ్యూనిస్టు పార్టీ నాయకత్వంలో విస్తృతంగా పోరాడారని తెలిపారు. ఈ పోరాటం కేవలం రాజకీయ అధికార మార్పు కోసం కాకుండా భూమి, జీవన హక్కులు, సామాజిక గౌరవం కోసం సాగిన ప్రజా ఉద్యమమని పేర్కొన్నారు.
పోరాటంలో వేలాది మంది రైతులు, కూలీలు, మహిళలు, యువత చేసిన త్యాగాలను విస్మరించి రాజకీయ ప్రయోజనాల కోసం చరిత్రను వక్రీకరించవద్దని ఆయన కోరారు. కె.ఎల్. మహేంద్ర, మఖ్దూమ్ మొహియుద్దీన్, రావి నారాయణరెడ్డి, బద్దం ఎల్లారెడ్డి, ఆరుట్ల రామచంద్రారెడ్డి, ఆరుట్ల కమలాదేవి, మల్లు స్వరాజ్యం తదితరులు ప్రజల్లో రాజకీయ, సామాజిక చైతన్యం పెంపొందించడంలో కీలక పాత్ర పోషించారని తెలిపారు.
చరిత్రను వ్యక్తులు, రాజకీయ పార్టీల ప్రచార సాధనంగా కాకుండా అందుబాటులో ఉన్న ఆధారాలు, చారిత్రక పత్రాలు, ప్రజల అనుభవాల ఆధారంగా వాస్తవికంగా నమోదు చేయాలని సీపీఐ డిమాండ్ చేస్తోందన్నారు. తెలంగాణ రైతాంగ పోరాట స్ఫూర్తి భూమి, శ్రమ, సామాజిక న్యాయం కోసం నేటికీ ప్రజలకు స్ఫూర్తినిస్తోందని మల్కయ్య పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్ జాతీయ కార్యవర్గ సభ్యులు కె. ధర్మేంద్ర, ఏఐటీయూసీ రాష్ట్ర నాయకులు కల్లూరి జయచంద్ర, సీపీఐ ఘట్కేసర్ మండల కార్యదర్శి లొట్టి ఈశ్వర్, మండల కార్యవర్గ సభ్యులు అన్వార్ పాషా, చౌదరి, బాలనర్సింహ, సరిత, బుల్లిబాబు, చారి, ప్రమీల, లక్ష్మి, కుమారి, రాములు, శ్యామ్, రాము, బిక్షపతి, రామచంద్ర, శంకరయ్య తదితరులు పాల్గొన్నారు.

