కేసీఆర్ నాయకత్వంతోనే తెలంగాణ పునర్నిర్మాణం సాధ్యం
– బీఆర్ఎస్ నాయకురాలు దాసరి ఉష
ప్రజావాణి జిల్లా ప్రతినిధి
పెద్దపల్లి సెప్టెంబర్ 29
కేసీఆర్ మళ్లీ సీఎం కావాలని ఆకాంక్షిస్తూ 200 కిలోమీటర్ల పాదయాత్ర
మంథని కార్యకర్తల పాదయాత్రకు పెద్దపల్లిలో దాసరి ఉష ఘన స్వాగతం
తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణం, అభివృద్ధి, సంక్షేమం కేసీఆర్ నాయకత్వంతోనే సాధ్యమవుతుందని బీఆర్ఎస్ నాయకురాలు, జిల్లా బీసీ జేఏసీ చైర్మన్ దాసరి ఉష అన్నారు. కేసీఆర్ తిరిగి ముఖ్యమంత్రి కావాలని, మంథని నియోజకవర్గం నుంచి పుట్ట మధు ఎమ్మెల్యేగా విజయం సాధించాలనే ఆకాంక్షతో మంథని నుంచి గజ్వేల్లోని ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రం వరకు బీఆర్ఎస్ కార్యకర్తలు, ఉద్యమకారులు చేపట్టిన పాదయాత్రకు ఆమె సంఘీభావం తెలిపారు.
బుర్ల వెంకటేష్, కొండ వెంకటేష్, బెన్నీ పాల్ ఆధ్వర్యంలో సుమారు 200 కిలోమీటర్ల మేర కొనసాగుతున్న పాదయాత్ర సోమవారం రాత్రి పెద్దపల్లికి చేరుకుంది. ఈ సందర్భంగా దాసరి ఉష పాదయాత్ర బృందానికి ఘనంగా స్వాగతం పలికి, వారి యాత్రకు సంపూర్ణ సంఘీభావం ప్రకటించారు.
ఈ సందర్భంగా దాసరి ఉష మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో కేసీఆర్ కీలక పాత్ర పోషించారని, రాష్ట్ర అభివృద్ధి కోసం ఆయన నాయకత్వం అవసరమని అన్నారు. కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి కావడం ద్వారా తెలంగాణలో మరింత అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ముందుకు సాగుతాయని పేర్కొన్నారు. అలాగే మంథని నియోజకవర్గ సమగ్ర అభివృద్ధికి పుట్ట మధు నాయకత్వం అవసరమని ఆమె అన్నారు.
కేసీఆర్, పుట్ట మధు విజయాలను ఆకాంక్షిస్తూ కార్యకర్తలు ఎలాంటి విరామం లేకుండా సుమారు 200 కిలోమీటర్ల సుదీర్ఘ పాదయాత్ర చేపట్టడం అభినందనీయమన్నారు. పార్టీ పట్ల కార్యకర్తలకు ఉన్న నిబద్ధత, అంకితభావానికి ఈ పాదయాత్ర నిదర్శనమని కొనియాడారు.
పాదయాత్రలో పాల్గొన్న కార్యకర్తలకు పెద్దపల్లిలో రాత్రి బస, భోజనం తదితర వసతి ఏర్పాట్లు చేశారు. అనంతరం వారు ఎర్రవల్లి వైపు తమ పాదయాత్రను కొనసాగించారు. ఈ సందర్భంగా దాసరి ఉష వారికి సాదరంగా వీడ్కోలు పలికి, పాదయాత్ర విజయవంతంగా పూర్తి కావాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ భిక్షపతి, ఓదెలు, అబ్దుల్ మాలిక్, కన్నం శ్రవణ్, సిద్దు, ఎండీ అజీమ్, శ్రీను, చరణ్ తేజ్, రజనీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

