అమరావతి, సెప్టెంబర్ 9 ప్రజావాణి మూడేళ్ల క్రితం అప్పటి ప్రతిపక్ష నేత, ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని అక్రమ కేసులతో అరెస్టు చేసి 53 రోజుల పాటు నిర్బంధించడం ప్రజాస్వామ్య చరిత్రలోనే ఒక చీకటి అధ్యాయమని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. సెప్టెంబర్ 9వ తేదీ తెలుగుజాతి చరిత్రలో ఎన్నటికీ మరచిపోలేని రోజని పేర్కొన్నారు. బుధవారం విజయవాడ క్యాంపు కార్యాలయంలో మంత్రి అచ్చెన్నాయుడు కొవ్వొత్తులు వెలిగించి, ఆనాటి ఘటనలను గుర్తు చేసుకుంటూ న్యాయం గెలిచింది.. సత్యం నిలిచింది అనే సందేశాన్ని ప్రజలకు అందించారు. రాజకీయ కక్షసాధింపుతో చంద్రబాబు నాయుడిపై పన్నిన కుట్రలు ఆయన రాజకీయ ప్రస్థానాన్ని అడ్డుకోలేకపోయాయని మంత్రి అన్నారు. ఒక ప్రజా నాయకుడిని జైలులో నిర్బంధించగలిగారు కానీ, ప్రజల గుండెల్లో ఆయనకు ఉన్న స్థానాన్ని మాత్రం ఎవరూ నిర్బంధించలేకపోయారని పేర్కొన్నారు. చంద్రబాబు నాయుడు అరెస్టు సమయంలో రాష్ట్రంలోనే కాకుండా దేశ, విదేశాల్లో ఉన్న తెలుగు ప్రజలు సైతం తీవ్రంగా స్పందించారని అచ్చెన్నాయుడు అన్నారు. 53 రోజుల పాటు చంద్రబాబు విడుదల కోసం రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలు, ఎన్‌ఆర్‌ఐలు చేసిన పోరాటం, సంఘీభావాన్ని ఎన్నటికీ మరువలేమని తెలిపారు. వారికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేశారు.ఎన్ని రాజకీయ కక్షలు, కుట్రలు, నిర్బంధాలు ఎదురైనా చంద్రబాబు నాయుడు ప్రజల పక్షాన నిలిచారని మంత్రి అన్నారు. ప్రజల కోసం ఆయన చేసిన పోరాటం, రాష్ట్ర అభివృద్ధికి అందించిన సేవలు ప్రజల మనస్సుల్లో చెరగని ముద్ర వేశాయని పేర్కొన్నారు. చంద్రబాబు నాయుడిని రాజకీయంగా దెబ్బతీయాలనే ప్రయత్నాలే చివరకు వైసీపీ పతనానికి నాంది పలికాయని అచ్చెన్నాయుడు అన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజలే అంతిమ నిర్ణేతలని, ప్రజల తీర్పు ముందు ఎలాంటి కుట్రలు, కక్షసాధింపులు నిలబడవని మరోసారి రుజువైందన్నారు. చింత చచ్చినా పులుపు చావనట్లు ప్రజలు గుణపాఠం చెప్పినా జగన్ బుద్ధి మారడం లేదు అని మంత్రి విమర్శించారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక వైసీపీ అనుకూల మీడియా ద్వారా తప్పుడు ప్రచారం చేస్తూ విషం కక్కుతున్నారని ఆరోపించారు. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకునేలా పాలిస్తున్న చంద్రబాబు నాయుడు, కూటమి ప్రభుత్వంపై కుట్రపూరిత ప్రచారాలు చేస్తున్న వారికి ప్రజలే తగిన సమాధానం చెప్పాలని అన్నారు. రాజకీయాల్లో కక్షసాధింపులకు తావు ఉండకూడదని అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. ప్రజల తీర్పును గౌరవిస్తూ రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమం, సుపరిపాలనకు కూటమి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందన్నారు.మూడేళ్ల క్రితం చీకటి రోజు ఉంటే.నేడు న్యాయం గెలిచిన రోజని మంత్రి పేర్కొన్నారు. ప్రజల ఆశీస్సులతో చంద్రబాబు నాయుడు తిరిగి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తున్నారని తెలిపారు. చంద్రబాబు నాయుడి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం రాష్ట్రాన్ని తిరిగి అభివృద్ధి,సంక్షేమం, సుపరిపాలన దిశగా నడిపిస్తోందని అచ్చెన్నాయుడు అన్నారు. గతంలో జరిగిన అన్యాయాలను ప్రజలు మర్చిపోలేదని,
అందుకే ఎన్నికల్లో కూటమి ప్రభుత్వానికి స్పష్టమైన తీర్పు ఇచ్చారని పేర్కొన్నారు.స్వర్ణాంధ్ర విజన్–2047 లక్ష్యంగా రాష్ట్ర అభివృద్ధిలో అన్ని వర్గాలు భాగస్వాములు కావాలని మంత్రి పిలుపునిచ్చారు. నవ్యాంధ్రప్రదేశ్‌ను అభివృద్ధి చెందిన రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు సమష్టిగా కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. చంద్రబాబు నాయుడి సేవలు,పోరాటం, ప్రజల కోసం ఆయన చేసిన కృషి తెలుగు ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతాయని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు.సత్యాన్ని, న్యాయాన్ని ఎంతకాలం అణచివేసినా చివరకు న్యాయమే గెలుస్తుందని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు.
చంద్రబాబు అరెస్టు ప్రజాస్వామ్య చరిత్రలో చీకటి అధ్యాయం న్యాయం గెలిచింది.సత్యం నిలిచింది: మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు
RELATED ARTICLES

