వైఎస్ఆర్ కడప జిల్లా కాశినాయన సెప్టెంబర్ 24 ప్రజావాణి మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్‌లో నూతన సబ్ ఇన్‌స్పెక్టర్ (ఎస్‌ఐ) గా డాక్టర్ నాయక్ బాధ్యతలు స్వీకరించారు.జిల్లా పోలీస్ యంత్రాంగం చేపట్టిన బదిలీల ప్రక్రియలో భాగంగా ఆయన ఇక్కడికి నియమితులయ్యారు.ఇప్పటివరకు కాశినాయన ఎస్‌ఐగా సమర్థవంతంగా సేవలందించిన యోగేంద్ర ఇక్కడి నుండి కొండాపురం పోలీస్‌స్టేషన్‌కు బదిలీ అయ్యారు.ఈ నేపథ్యంలో డాక్టర్ నాయక్ బుధవారం ఉదయం పోలీస్ స్టేషన్‌లో శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి, అధికారికంగా బాధ్యతలను చేపట్టారు.
ఘనంగా వీడ్కోలు.. సాదర స్వాగతం:
బదిలీపై వెళ్తున్న ఎస్‌ఐ యోగేంద్రకు పోలీస్ సిబ్బంది, స్థానిక ప్రముఖులు ఘనంగా వీడ్కోలు పలికారు. ఆయన మండలంలో అందించిన సేవలను ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు. అనంతరం బాధ్యతలు స్వీకరించిన నూతన ఎస్‌ఐ డాక్టర్ నాయక్‌కు స్టేషన్ సిబ్బంది, ఏఎస్ఐలు, కానిస్టేబుళ్లు పుష్పగుచ్ఛాలు అందించి సాదర స్వాగతం పలికారు.బాధ్యతల స్వీకరణ అనంతరం నూతన ఎస్‌ఐ డాక్టర్ నాయక్ మీడియాతో మాట్లాడారు. మండలంలో శాంతిభద్రతల పరిరక్షణకు తాము మొదటి ప్రాధాన్యత ఇస్తామని స్పష్టం చేశారు. సమాజంలో ప్రతి ఒక్కరూ చట్టాన్ని గౌరవించాలని, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. ముఖ్యంగా మండల పరిధిలో అసాంఘిక కార్యకలాపాలు,జూదం,బెల్ట్ షాపులు,అక్రమ మద్యం రవాణా వంటి వాటిపై ఉక్కుపాదం మోపుతామన్నారు.
ప్రజలకు అందుబాటులో ఉంటాం:
బాధితులకు త్వరితగతిన న్యాయం జరిగేలా చూస్తామని, పోలీస్ స్టేషన్‌కు వచ్చే ప్రతి ఒక్కరి సమస్యను సానుకూలంగా విని తగిన చర్యలు తీసుకుంటామని ఎస్‌ఐ భరోసా ఇచ్చారు. ప్రజలు భయపడకుండా తమ సమస్యలను నేరుగా వచ్చి చెప్పుకోవచ్చని,మండలంలో నేరాల నియంత్రణకు రాత్రి వేళల్లో గస్తీని మరింత ముమ్మరం చేస్తామని వివరించారు.మండలంలో శాంతియుత వాతావరణం నెలకొల్పేందుకు మరియు పోలీస్ శాఖకు మంచి పేరు తెచ్చేందుకు స్థానిక ప్రజలు, యువత, ప్రజాప్రతినిధులు తమకు పూర్తి సహకారం అందించాలని ఆయన ఈ సందర్భంగా కోరారు.ఈ కార్యక్రమంలో పోలీస్ స్టేషన్ రైటర్, కానిస్టేబుళ్లు, పలువురు స్థానిక నాయకులు పాల్గొన్నారు.

