వై.ఎస్.ఆర్ కడప బి కోడూరు సెప్టెంబర్ 7 ప్రజావాణి :గ్రామాల్లో శాంతిభద్రతలను కాపాడటం, మహిళల రక్షణే ధ్యేయంగా పోలీసులు ముందడుగు వేస్తున్నారు. వై.ఎస్.ఆర్ కడప జిల్లా ఎస్పీ శ్రీ షెల్కే నచికేత్ విశ్వనాథ్, ఐ.పి.ఎస్. ప్రత్యేక ఆదేశాల మేరకు బి.కోడూరు పోలీస్ స్టేషన్ సబ్ ఇన్‌స్పెక్టర్ (ఎస్.ఐ) తాయార్ హుసేన్ తన సిబ్బందితో కలిసి సోమవారం అమ్మవారిపేట గ్రామంలో పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలను ఒకచోటకు చేర్చి పలు కీలక అంశాలపై విస్తృత అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఎన్నికల నిబంధనలు పాటించాలి:
త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఎస్.ఐ గ్రామస్థులకు పలు సూచనలు చేశారు. ఎన్నికల సమయంలో ఎలాంటి గొడవలు, కుల మతాల పరమైన వివాదాలకు తావివ్వకూడదని చెప్పారు. ప్రతి ఒక్కరూ ఎన్నికల నియమ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలన్నారు. ఓటర్లు ఎలాంటి ప్రలోభాలకు లోనుకాకుండా, ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు ముగిసేలా పోలీసు యంత్రాంగానికి పూర్తి స్థాయిలో సహకరించాలని కోరారు. గ్రామంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే చట్టపరమైన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.
మహిళల భద్రతకే ప్రథమ ప్రాధాన్యం:
ఈ సదస్సులో మహిళల రక్షణ మరియు భద్రతపై ఎస్.ఐ ప్రత్యేకంగా మాట్లాడారు. మహిళలపై జరిగే నేరాల నివారణకు చట్టాలు ఏ విధంగా ఉపయోగపడతాయో వివరించారు. ఈ రోజుల్లో మహిళలు వేధింపులకు గురైతే మౌనంగా ఉండకూడదని, ధైర్యంగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. తమకు ఎలాంటి సమస్యలు ఎదురైనా, వేధింపులు జరిగినా భయపడకుండా వెంటనే పోలీసులను ఆశ్రయించాలని సూచించారు. సమాచారం ఇచ్చే వారి వివరాలను రహస్యంగా ఉంచుతామని భరోసా ఇచ్చారు.
పోలీసులకు సహకరించాలి:
గ్రామాల్లో శాంతిభద్రతలు సక్రమంగా ఉండాలంటే కేవలం పోలీసుల వల్లే సాధ్యం కాదని, ప్రజల భాగస్వామ్యం కూడా ఎంతో అవసరమని ఎస్.ఐ అభిప్రాయపడ్డారు. ప్రతి ఒక్కరూ బాధ్యతగల పౌరులుగా వ్యవహరించి, గ్రామాల్లో ఎలాంటి అనుమానాస్పద వ్యక్తులు కనిపించినా లేదా అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నా వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బందితో పాటు అమ్మవారిపేట గ్రామ ప్రజలు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

