విద్యార్థుల గుండె రగిలింది… పాలిటెక్నిక్ భవిష్యత్ పై ‘శక్తి’ నీడలు!
లాటరల్ ఎంట్రీకి బ్రేక్.. బీటెక్ కలలు చెల్లాచెదురేనా?
శాంతియుత పోరాటంపై ఖాకీ ప్రతాపం.. సిఐ రఘుపతి రెడ్డిపై వేటు వేయాల్సిందే!
కేసముద్రం పాలిటెక్నిక్ కాలేజ్ ఎదుట డీఎస్ఏ శ్రావణ్ గౌడ్ డిమాండ్ చేశారు.
కేసముద్రం, ఆగస్టు 20, ప్రజావాణి.
పాలిటెక్నిక్ చదువుతున్న వేలాది మంది విద్యార్థుల కళ్లల్లో భవిష్యత్తుపై గందరగోళం, గుండెల్లో ఆవేదన కట్టలు తెంచుకున్నాయి. పాలిటెక్నిక్ విద్యను ‘శక్తి’ (స్కిల్ యూనివర్సిటీ) స్కీంలో విలీనం చేస్తూ ప్రభుత్వం తెచ్చిన జీఓ నెంబర్ 97 విద్యార్థుల జీవితాలను అంధకారంలోకి నెడుతోందని డెమొక్రటిక్ స్టూడెంట్స్ అసోసియేషన్ తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ కామగోని శ్రవణ్ గర్జించారు. గురువారం మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండల కేంద్రంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ఎదుట విద్యార్థుల గొంతుకై డీఎస్ఏ భారీ నిరసన ప్రదర్శన చేపట్టింది. ఈ సందర్భంగా విద్యార్థుల హక్కుల కోసం జరిగిన పోరాటం హోరెత్తింది.
కార్పొరేట్లకు ఊడిగమా?
ఉన్నత చదువులకు మంగళమా?సమావేశంలో కామగోని శ్రవణ్ మాట్లాడుతూ, ప్రభుత్వం విద్యార్థుల జీవితాలతో ప్రమాదకరమైన చెలగాటం ఆడుతోందని మండిపడ్డారు.పాలిటెక్నిక్ పూర్తి చేసిన పేద, మధ్యతరగతి విద్యార్థులకు లాటరల్ ఎంట్రీ ద్వారా నేరుగా బీటెక్ ద్వితీయ సంవత్సరంలో చేరి ఉన్నత శిఖరాలను అధిరోహించే అద్భుత అవకాశం ఉండేదని గుర్తు చేశారు. అయితే, తాజా విలీనంతో ఆ పైచదువుల మార్గాన్ని ప్రభుత్వం పూర్తిగా మూసివేస్తోందని ఆరోపించారు. స్కిల్ యూనివర్సిటీ పేరుతో విద్యార్థులను కార్పొరేట్ కంపెనీలకు కేవలం చౌకబారు లేబర్లుగా మార్చేందుకే ఈ కుట్ర అని శ్రవణ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
న్యాయం అడిగితే గొంతు నులుముతారా?
ఇటీవల మహబూబాబాద్ జిల్లా కలెక్టరేట్ ఎదుట తమ భవిష్యత్తును కాపాడాలంటూ శాంతియుతంగా నిరసన తెలుపుతున్న పాలిటెక్నిక్ విద్యార్థులపై పోలీసులు ప్రవర్తించిన తీరుపై డీఎస్ఏ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. తోపులాట సాకుతో విద్యార్థుల గొంతు నులిమిన మహబూబాబాద్ సిఐ రఘుపతి రెడ్డిపై తక్షణమే సస్పెన్షన్ వేటు వేయాలని డిమాండ్ చేశారు. “న్యాయం కోసం ప్రశ్నిస్తే గొంతు నొక్కేస్తారా? ఈ ఖాకీ జులూం సాగనివ్వం” అని హెచ్చరించారు.ప్రభుత్వం తక్షణమే స్పందించి వివాదాస్పద జీఓ నెంబర్ 97ను వెనక్కి తీసుకోవాలని, లేనిపక్షంలో ఈ ఉద్యమం కేసముద్రం దాటి రాష్ట్రవ్యాప్తంగా దావానలంలా మారుతుందని విద్యార్థి లోకం హెచ్చరించింది. ఈ నిరసన సెగతోనైనా అధికారుల్లో, పాలకుల్లో చలనం రావాలని, విద్యార్థుల కళ్లల్లో ఆనందం చూసేవరకు పోరాటం ఆపేది లేదని స్పష్టం చేశారు. ఈ రణభేరిలో డీఎస్ఏ నాయకులు శివ, కమల్, జాషువా, వెంకటేశ్, సంపత్, సుమన్, గోవర్ధన్ తదితరులు విద్యార్థులకు అండగా నిలిచారు.

