అర్హులైన ప్రతి ఒక్కరి పేరు ఓటర్ల జాబితాలో ఉండేలా చర్యలు తీసుకోవాలి: మాజీ కౌన్సిలర్ కౌడే మహేష్ కురుమ
ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్ –2026)లో భాగంగా మేడ్చల్ డివిజన్ పరిధిలోని పోలింగ్ బూత్ నంబర్లు 76, 77కు సంబంధించి లక్ష్మమ్మ స్మారక విద్యాలయం ప్రాంగణంలో గురువారం వార్డు సభ నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి సి. సుదర్శన్ రెడ్డి ఆదేశాల మేరకు మేడ్చల్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ సుధాంష్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో మేడ్చల్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, మాజీ కౌన్సిలర్ కౌడే మహేష్ కురుమ పాల్గొని సర్ ప్రక్రియపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా మహేష్ కురుమ మాట్లాడుతూ అర్హత కలిగిన ప్రతి ఒక్కరి పేరు ఓటర్ల జాబితాలో ఉండేలా చూడటమే సార్ ప్రధాన లక్ష్యమని అన్నారు. ప్రజలు తమ పేర్లు, చిరునామా తదితర వివరాలను ఓటర్ల జాబితాలో సరిచూసుకోవాలని సూచించారు.
వార్డు సభలో బూత్ లెవల్ అధికారులు (బీఎల్ఓలు) ముసాయిదా ఓటర్ల జాబితాలోని పేర్లను చదివి వినిపించారు. జాబితాలో పేరు తొలగిపోయిన భారత పౌరులు సంబంధిత వివరాలను పరిశీలించి అవసరమైన ప్రక్రియను పూర్తి చేసుకోవాలని సూచించారు. అక్టోబర్ 1, 2026 నాటికి 18 సంవత్సరాలు నిండే యువత ఫారం–6తో పాటు అవసరమైన డిక్లరేషన్, పత్రాలను సమర్పించి ఓటరుగా నమోదు చేసుకోవాలని తెలిపారు.
ముసాయిదా జాబితాలో పేర్లు, వివరాల్లో తప్పులు లేదా వ్యత్యాసాలు ఉంటే ఫారం–8 ద్వారా సవరణకు దరఖాస్తు చేసుకోవచ్చని వివరించారు. మృతి చెందిన వారు, డబుల్ ఎంట్రీలు, ఇతర ప్రాంతాలకు తరలిపోయిన వారు వంటి అనర్హుల వివరాలను నిబంధనల ప్రకారం పరిశీలించి ఫారం–7 ద్వారా అభ్యంతరాలు నమోదు చేయాలని సూచించారు.
క్లెయిమ్‌లు, అభ్యంతరాలపై నిర్ణీత గడువులో విచారణ జరిపి నివేదికలు సమర్పించాలని అధికారులను కోరారు. SIR ఫేజ్–2 ప్రక్రియను అధికారులు, బిఎల్ఓ లు, బిల్ఏ సమన్వయంతో సమర్థవంతంగా పూర్తి చేసి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని మహేష్ కురుమ అన్నారు. ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకునేలా సహకరించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో ఆర్‌ఓ సాయి మాధురి, బిఎల్ఓ సూపర్వైజర్లు రాజబాబు, లావణ్య, చత్రపతి, బిఎల్ఓ ఇందిరా, అఫ్రోజ్, శిరీష, బీఎల్ఏ, ఎన్ఎస్ యుఐ
ఆధ్యక్షుడు గుండ శ్రీధర్ కురుమ, మేకల రాజశేఖర్ రెడ్డి (బబ్లూ), మాజీ వార్డు సభ్యుడు కౌడే నాగేందర్ కురుమ, పెంజర్ల భాస్కర్ యాదవ్, మైసరి రాజు వంజరి, ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, యువత, మహిళలు తదితరులు పాల్గొన్నారు.

