బెజ్జంకి, ఆగస్టు 19 (ప్రజావాణి):
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన బీసీ మహిళల కుట్టు మిషన్ల పథకం ద్వారా అర్హులైన బీసీ మహిళలకు ఉచితంగా కుట్టు మిషన్లు అందించడంతో పాటు నైపుణ్య శిక్షణ, మార్కెటింగ్ సహాయం, స్వయం ఉపాధికి ప్రభుత్వం చేయూత అందించనుందని గుగ్గిళ్ల గ్రామశాఖ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దూశెట్టి ప్రశాంత్ రెడ్డి తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీసీ మహిళల అభివృద్ధి, ఆర్థిక స్వావలంబన కోసం ప్రభుత్వం చేపడుతున్న పథకాలను అర్హులైన మహిళలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మహిళల నైపుణ్యాలను అభివృద్ధి చేసి కుటుంబ ఆదాయాన్ని పెంచడం, మహిళల ఆర్థిక సాధికారతకు బాటలు వేయడం ఈ పథకం ప్రధాన ఉద్దేశమని తెలిపారు.
**దరఖాస్తుకు అవసరమైన పత్రాలు**
ఆధార్ కార్డు, రేషన్ కార్డు, బీసీ కుల ధృవీకరణ పత్రం, నివాస ధృవీకరణ పత్రం, ఆదాయ ధృవీకరణ పత్రం, బ్యాంకు పాస్‌బుక్ జిరాక్స్, రెండు పాస్‌పోర్ట్ సైజ్ ఫొటోలు, మొబైల్ నంబర్ సమర్పించాల్సి ఉంటుందని తెలిపారు.అర్హులైన మహిళలు తమ గ్రామ/మండల పరిషత్ కార్యాలయాలు లేదా మహిళా శిక్షణ కేంద్రాల్లో సంప్రదించి దరఖాస్తు వివరాలు తెలుసుకోవాలని సూచించారు. దరఖాస్తులు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు స్వీకరించనున్నట్లు తెలిపారు.

