ప్రభుత్వ విద్యను బలోపేతం చేయాలి
జిల్లా విద్యా సదస్సును విజయవంతం చేయాలని సీపీఎం పిలుపు

మేడ్చల్: ప్రభుత్వ విద్యారంగాన్ని పటిష్టం చేయాలని, విద్యా రంగంలో ప్రైవేటీకరణ, కార్పొరేటీకరణకు స్వస్తి పలకాలని డిమాండ్ చేస్తూ సీపీఎం ఆధ్వర్యంలో నిర్వహించనున్న జిల్లా విద్యా సదస్సును విజయవంతం చేయాలని కోరుతూ మేడ్చల్లో పోస్టర్ను విడుదల చేశారు.
ఈ సందర్భంగా సీపీఎం మేడ్చల్ మండల కార్యదర్శి ఎం. నరేష్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన విద్యా విధానం–2020 (NEP-2020) విద్యారంగంలో పెద్ద మార్పులు తీసుకువస్తామని చెబుతున్నప్పటికీ, ప్రభుత్వ విద్యా వ్యవస్థను బలోపేతం చేయడం కంటే ప్రైవేటీకరణ, కార్పొరేటీకరణకు మరింత అవకాశం కల్పించే విధంగా ఉందని విమర్శించారు. విద్యా వ్యవస్థ కేంద్రీకరణ, పాఠశాలల విలీనాలు, మూసివేతలు, ఉన్నత విద్యలో ప్రైవేట్ పెట్టుబడులకు పెరుగుతున్న అవకాశాల వల్ల పేద, మధ్యతరగతి, గ్రామీణ విద్యార్థులకు నాణ్యమైన విద్య దూరమయ్యే ప్రమాదం ఉందన్నారు.
NEP-2020 విద్యను కేంద్రీకరణ, కార్పొరేటీకరణతో పాటు కాషాయీకరణ దిశగా తీసుకెళ్తోందని నరేష్ ఆరోపించారు. సమానత్వం, సామాజిక న్యాయం, లౌకికత్వాన్ని కాపాడుతూ ప్రతి ఒక్కరికీ ఉచిత, నాణ్యమైన విద్య అందేలా విధానాలను రూపొందించాల్సిన అవసరం ఉందన్నారు. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని ప్రజలకు పిలుపునిచ్చారు.
తెలంగాణలో ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో మౌలిక సదుపాయాల కొరత తీవ్రంగా ఉందని, సరిపడా తరగతి గదులు, టాయిలెట్లు అందుబాటులో లేకపోవడంతో పాటు ఉపాధ్యాయుల ఖాళీలు కూడా పెద్ద సంఖ్యలో ఉన్నాయని తెలిపారు. మరోవైపు ప్రైవేట్ విద్యాసంస్థలు వేగంగా విస్తరిస్తున్నాయని అన్నారు.
జిల్లాలో ప్రభుత్వ విద్యాసంస్థలను బలోపేతం చేసేందుకు రాష్ట్ర బడ్జెట్లో 30 శాతం నిధులు విద్యారంగానికి కేటాయించాలని డిమాండ్ చేశారు. కేవలం కొన్ని మోడల్ స్కూళ్లను ఏర్పాటు చేసి ప్రచారానికి పరిమితం కాకుండా అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు, ఉపాధ్యాయుల నియామకాలు, నాణ్యమైన విద్యకు అవసరమైన వనరులు కల్పించాలని కోరారు.
మేడ్చల్ మండలంలోనూ కార్పొరేట్ పాఠశాలల సంఖ్య పెరుగుతూ తల్లిదండ్రులపై ఆర్థిక భారం పెరుగుతోందని నరేష్ అన్నారు. విద్యా హక్కు చట్టం ప్రకారం ప్రైవేట్ పాఠశాలల్లో 25 శాతం ఉచిత సీట్లను అమలు చేసేలా ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో సీపీఎం మేడ్చల్ మండల కమిటీ నాయకులు కొమురయ్య, సభ్యులు ఎన్. కృష్ణ, స్వామి, ఎల్లం, సీహెచ్. కృష్ణ, నర్సింహా, శ్రీను, నిర్మల, అస్తరమా, రజిని తదితరులు పాల్గొన్నారు.

