ఘట్‌కేసర్: పోచారం యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు యుగేంధర్ రెడ్డి, మాజీ ఉప సర్పంచ్ బాల్ రెడ్డి నిరంతర కృషి ఫలితంగా పెరుమాల చెరువు హద్దుల నిర్ధారణ (బౌండరీ ఫిక్సింగ్) ప్రక్రియతో పాటు అభివృద్ధి పనులు కీలక దశకు చేరుకున్నాయి. ఇన్ఫోసిస్ సంస్థ సామాజిక బాధ్యత నిధుల సహకారంతో చెరువు అభివృద్ధి పనులు త్వరలో ప్రారంభం కానున్నాయి.
పెరుమాల చెరువు సమీపంలోని ప్రసిద్ధ దేవాలయానికి ప్రతిరోజూ అధిక సంఖ్యలో భక్తులు రాకపోకలు సాగిస్తుంటారు. చెరువు అభివృద్ధి పూర్తయిన అనంతరం ఈ ప్రాంతం ఘట్‌కేసర్ సర్కిల్‌లో మినీ ట్యాంక్‌బండ్‌గా రూపుదిద్దుకుని భక్తులు, స్థానిక ప్రజలు, యువతకు ఆహ్లాదకరమైన విహార కేంద్రంగా మారనుందని నిర్వాహకులు తెలిపారు.
అభివృద్ధి పనులను వేగవంతం చేయడానికి ఇరిగేషన్ డీఈఈ అంజనేయులు హెచ్‌ఎండీఏ అధికారులకు అధికారిక లేఖలు పంపించి అవసరమైన అనుమతులు, సమన్వయం కోసం చర్యలు చేపట్టారు.
ఈ కార్యక్రమం విజయవంతం కావడంలో డీసీసీ అధ్యక్షుడు, మేడ్చల్ అసెంబ్లీ ఇన్‌చార్జ్ తోటకూర వజ్రేష్ యాదవ్, ఇరిగేషన్ డీఈఈ అంజనేయులు, ఇరిగేషన్ ఏఈఈ మౌనిక, ఘట్‌కేసర్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ వాణి, డీఈఈ నరేష్ విశేష సహకారం అందించారని యుగేంధర్ రెడ్డి, బాల్ రెడ్డి పేర్కొంటూ వారికి కృతజ్ఞతలు తెలిపారు.
పెరుమాల చెరువు అభివృద్ధి ద్వారా పర్యావరణ పరిరక్షణకు ఊతమివ్వడంతో పాటు భక్తులు, స్థానిక ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించబడతాయని, భవిష్యత్తులో ఇది ఘట్‌కేసర్ సర్కిల్‌లో ఆదర్శప్రాయమైన ప్రజా విహార కేంద్రంగా నిలుస్తుందని వారు ఆశాభావం వ్యక్తం చేశారు.


