బెజ్జంకి, ఆగస్టు 13 (ప్రజావాణి)
సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని దేవక్కపల్లి గ్రామంలో రహదారి అధ్వానంగా మారడంతో ప్రజలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోడ్డుపై ఏర్పడిన భారీ గుంతల్లో వర్షపు నీరు నిలిచిపోవడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది.గుంతలను తప్పించుకుంటూ వాహనాలు నడపాల్సి రావడంతో ప్రమాదాల భయం నెలకొంది. ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులు, వృద్ధులు, చిన్నారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.రోడ్డు దుస్థితిపై పలుమార్లు సంబంధిత ప్రజాప్రతినిధులు, అధికారుల దృష్టికి తీసుకెళ్లినా సమస్య పరిష్కారం కాలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి రోడ్డుకు వెంటనే మరమ్మతులు చేపట్టి ప్రజల ఇబ్బందులు తొలగించాలని గ్రామస్థులు కోరుతున్నారు.

