బేగంపేట, ఆగస్టు 16 (ప్రజావాణి):
సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల పరిధిలోని బేగంపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 1986–87 బ్యాచ్‌లో ఎస్‌ఎస్‌సీ పూర్తి చేసిన పూర్వ విద్యార్థులు తమకు బయోసైన్స్ బోధించిన గురువు అనంతరెడ్డి సార్‌ను కుటుంబ సమేతంగా కలిసి ఆత్మీయంగా సన్మానించారు.ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులు నాటి జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. అనంతరెడ్డి సార్ ఎంతో క్రమశిక్షణతో ఉంటూ, తన విధులను అంకితభావంతో నిర్వర్తించేవారని గుర్తుచేసుకున్నారు. విద్యార్థులను చదువులోనే కాకుండా జీవితంలోనూ ఉన్నతంగా ఎదగాలని అనేక విషయాల్లో ప్రోత్సహించేవారని తెలిపారు.పూర్వ విద్యార్థులు తమ సతీమణులు, పిల్లలతో కలిసి గురువు పాదాలకు నమస్కరించి ఆశీర్వాదాలు తీసుకున్నారు. అనంతరం అనంతరెడ్డి సార్‌కు శాలువా కప్పి ఘనంగా సత్కరించారు.ఈ సందర్భంగా అనంతరెడ్డి సార్ మాట్లాడుతూ, తన శిష్యులు చదువులు పూర్తి చేసి, వారి పిల్లలు సైతం పెద్దవారైన తర్వాత కూడా తనను గుర్తుంచుకుని కుటుంబ సమేతంగా వచ్చి కలవడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. పూర్వ విద్యార్థులందరూ ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో సుఖసంతోషాలతో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదించారు.

