ఘట్‌కేసర్, ఆగస్టు 22 (ప్రజావాణి): గురుకుల్ కళాశాల అభివృద్ధికి తనవంతు సహాయ సహకారాలు అందించడంతో పాటు, కళాశాలలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి అన్నారు. ఘట్‌కేసర్ సర్కిల్ పరిధిలోని గురుకుల్ కళాశాలలో గురుకుల్ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో విద్యార్థినీ, విద్యార్థుల కోసం నిర్మించిన వాష్‌రూమ్‌లతో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాలను ఆయన ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు.
ఈ సందర్భంగా మల్లారెడ్డి మాట్లాడుతూ గురుకుల్ కళాశాల అభివృద్ధి కోసం గురుకుల్ పరిరక్షణ సమితి సభ్యులు చేస్తున్న కృషిని అభినందించారు. గురుకుల్ జూనియర్ కళాశాలను కేజీ నుంచి పీజీ వరకు అభివృద్ధి చేసేందుకు శాయశక్తులా కృషి చేస్తానని తెలిపారు. ప్రస్తుతం కళాశాలలో అధ్యాపకుల కొరత కారణంగా విద్యార్థులకు ఆశించిన స్థాయిలో విద్య అందడం లేదని పేర్కొన్నారు. ఈ సమస్యను ఇంటర్మీడియట్ కమిషనర్ దృష్టికి తీసుకెళ్లి త్వరలో పరిష్కరించేందుకు కృషి చేస్తానన్నారు.
గురుకుల్ కళాశాలను ఎండోమెంట్ శాఖ నుంచి ప్రభుత్వం స్వాధీనం చేసుకునేలా ముఖ్యమంత్రితో చర్చిస్తానని మల్లారెడ్డి హామీ ఇచ్చారు. కళాశాల అభివృద్ధికి అవసరమైన అన్ని విధాలుగా తన సహకారం అందిస్తానని స్పష్టం చేశారు.
అధికార పార్టీ నాయకుల గైర్హాజరుపై చర్చ
గురుకుల్ కళాశాలలో జరిగిన అభివృద్ధి కార్యక్రమానికి స్థానిక అధికార పార్టీ నాయకులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు హాజరు కాకపోవడం చర్చనీయాంశంగా మారింది. కళాశాల అభివృద్ధి కార్యక్రమానికి స్థానిక నాయకులు దూరంగా ఉండటంపై పలువురు అసంతృప్తి వ్యక్తం చేశారు. విద్యార్థుల సమస్యలు, కళాశాల అభివృద్ధిపై నాయకులకు ఉన్న శ్రద్ధ ఏంటో వారి గైర్హాజరుతో స్పష్టమవుతోందని కార్యక్రమానికి హాజరైన పలువురు పేర్కొన్నారు.
ప్రతిభావంతులకు రూ.5 వేల నగదు బహుమతి
గురుకుల్ కళాశాలలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ఉత్తీర్ణులైన విద్యార్థుల్లో అత్యధిక మార్కులు సాధించిన వారికి లాల్ బహదూర్ స్మారక యువజన సంఘం ఆధ్వర్యంలో రూ.5 వేల చొప్పున నగదు బహుమతి అందజేస్తామని సంఘం అధ్యక్షులు బ్రహ్మం ప్రకటించారు. కార్యక్రమానికి హాజరైన పలువురు గురుకుల్ పరిరక్షణ సమితి సభ్యులు చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను అభినందించారు. అనంతరం సమితి సభ్యులను శాలువాలతో ఘనంగా సన్మానించారు.
ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీలు బండారి శ్రీనివాస్ గౌడ్, ఏనుగు సుదర్శన్ రెడ్డి, మాజీ జడ్పీటీసీ సింగిరెడ్డి రామిరెడ్డి, జేఏసీ కన్వీనర్ మారం లక్ష్మారెడ్డి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు వేముల సంజీవ గౌడ్, బీజేపీ అధ్యక్షులు కొమ్మిడి మహిపాల్ రెడ్డి, గురుకుల్ పరిరక్షణ సమితి సభ్యులు, గురుకుల్ వాకర్స్ అసోసియేషన్ సభ్యులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, యువజన సంఘాల ప్రతినిధులు, ప్రిన్సిపాల్ నారాయణరెడ్డి, అధ్యాపకులు, విద్యార్థినీ విద్యార్థులు, పూర్వ విద్యార్థులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


