📄 ePaper
Epaper 2
Thursday, September 17, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణHanumakondaఅర్పణపల్లిలో ఆధ్యాత్మిక సందడి.. ముత్యాలమ్మ తల్లి బోనాల జాతర !

అర్పణపల్లిలో ఆధ్యాత్మిక సందడి.. ముత్యాలమ్మ తల్లి బోనాల జాతర !

📰 Generate e-Paper Clip





ఊరి దేవతకు బోనం.. గ్రామ ఐకమత్యానికి ప్రతీకగా ఆషాఢ ఉత్సవాలు.




పసుపు–కుంకుమల పరిమళం.. వేపాకుల అలంకరణ.. మహిళల బోనాల ఊరేగింపుతో పండుగ.




కేసముద్రం, ఆగస్టు 9 (ప్రజావాణి):


ఆషాఢ మాసం వచ్చిందంటే తెలంగాణ పల్లెల్లో పండుగ సందడి మొదలవుతుంది. ఊరి దేవతకు మొక్కులు చెల్లించి.. తమ ఇళ్లకు, పంట పొలాలకు అమ్మవారి ఆశీస్సులు ఉండాలని కోరుకునే భక్తి భావం ప్రతి పల్లెలోనూ కనిపిస్తుంది. అదే ఆధ్యాత్మికతకు, తెలంగాణ పల్లె సంస్కృతికి అద్దం పడుతూ అర్పణపల్లి గ్రామం ముత్యాలమ్మ తల్లి బోనాల జాతరకు ముస్తాబైంది.
ఊరిలో కొలువై ఉండి తమను కంటికి రెప్పలా కాపాడుతుందని విశ్వసించే ముత్యాలమ్మ తల్లికి బోనం సమర్పించేందుకు గ్రామ మహిళలు భక్తిశ్రద్ధలతో సిద్ధమవుతున్నారు. పసుపు, కుంకుమలు, వేపాకులతో మట్టి, రాగి కుండలను అలంకరించి.. నైవేద్యాన్ని బోనంగా తలపై ధరించి మహిళలు ఊరేగింపుగా అమ్మవారి ఆలయానికి తరలివెళ్లనున్నారు.ఈ బోనాల జాతరలో మరో ప్రత్యేకత గ్రామ ఐకమత్యం. వ్యక్తిగత భేదాభిప్రాయాలను పక్కనపెట్టి గ్రామ పెద్దలు, మహిళలు, యువత, ప్రజలంతా ఒక్కతాటిపైకి వచ్చి ఉత్సవ ఏర్పాట్లలో భాగస్వాములవుతున్నారు. ఎవరి బాధ్యత వారు స్వీకరిస్తూ పండుగను ఘనంగా నిర్వహించేందుకు ముందుకు రావడం అర్పణపల్లి సామాజిక ఐక్యతకు నిదర్శనంగా నిలుస్తోంది.
అమ్మవారి పండుగ తమ ఊరి పండుగగా భావిస్తూ ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావడం గ్రామంలోని ఆధ్యాత్మిక వాతావరణాన్ని మరింత పెంచుతోంది.అమ్మవారిని దర్శించుకునే ప్రతి భక్తుడి మనసులో ఒకటే కోరిక.. వానలు సమృద్ధిగా కురవాలి.. చెరువులు, కుంటలు నిండాలి.. పంట పొలాలు పచ్చగా కళకళలాడాలి.. రైతు కుటుంబాల్లో సంతోషం వెల్లివిరియాలి.
రైతు బాగుంటేనే ఊరు బాగుంటుంది. ప్రతి ఇంటా సుఖసంతోషాలు వెల్లివిరియాలి అంటూ గ్రామ రైతులు, ప్రజలు ముత్యాలమ్మ తల్లిని వేడుకుంటున్నారు.బోనాల రోజున మంగళవాయిద్యాల నడుమ మహిళల బోనాల ఊరేగింపు, పోతురాజుల విన్యాసాలు, శివసత్తుల ఆధ్యాత్మిక వాతావరణంతో అర్పణపల్లి వీధులు సందడిగా మారనున్నాయి. పసుపు, కుంకుమలతో ముస్తాబైన బోనాలు.. వేపాకుల అలంకరణ.. భక్తుల జయజయధ్వానాలతో తెలంగాణ పల్లె సంస్కృతి సజీవంగా ఆవిష్కృతం కానుంది.
అమ్మవారి ఆశీస్సులతో.. అర్పణపల్లికి సుభిక్షం
ముత్యాలమ్మ తల్లి కరుణాకటాక్షాలతో గ్రామ ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో జీవించాలని.. పాడిపంటలు సమృద్ధిగా పండాలని.. యువతకు మంచి భవిష్యత్ లభించాలని.. గ్రామం అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో ముందుకు సాగాలని అర్పణపల్లి ప్రజలు కోరుకుంటున్నారు.
పండుగ అంటే కేవలం వేడుక కాదు.. ఒక ఊరి ఆత్మను, ఆ ఊరి విశ్వాసాన్ని, సంప్రదాయాన్ని, ఐకమత్యాన్ని ఒకే చోట చాటిచెప్పే సందర్భం. అర్పణపల్లి ముత్యాలమ్మ తల్లి బోనాల జాతర అదే సందేశాన్ని మరోసారి చాటుతోంది.
అర్పణపల్లి ప్రజలందరికీ ముత్యాలమ్మ తల్లి బోనాల పండుగ శుభాకాంక్షలు.
– గంధం సతీష్, జర్నలిస్ట్, ప్రజావాణి

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.