ఘట్‌కేసర్, ఆగస్టు 16 (ప్రజా వాణి): ఘట్‌కేసర్ సర్కిల్ పోచారం మున్సిపాలిటీ పరిధిలోని అన్నోజిగూడలో ఎర్రపోచమ్మ, నల్లపోచమ్మ దేవాలయాల బోనాల ఉత్సవాలు ఆదివారం అత్యంత వైభవంగా, భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. రేవంతన్న టీం సభ్యులు, యువనేత సింగిరెడ్డి శ్రీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలకు పోచారం ఐటీ కారిడార్ సీఐ జగన్నాథ్ ముఖ్య అతిథిగా హాజరై అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు, సింగిరెడ్డి శ్రీకాంత్ రెడ్డి, సీఐ జగన్నాథ్‌కు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. అనంతరం అమ్మవార్లకు బోనాలు సమర్పించి, భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ప్రాంగణం భక్తులతో కిక్కిరిసి పండుగ వాతావరణం నెలకొంది.
ఈ సందర్భంగా సీఐ జగన్నాథ్ మాట్లాడుతూ అన్నోజిగూడలో బోనాల ఉత్సవాలను ప్రజలంతా కలిసికట్టుగా భక్తిశ్రద్ధలతో జరుపుకోవడం ఎంతో సంతోషకరమన్నారు. యువనేత సింగిరెడ్డి శ్రీకాంత్ రెడ్డి ఆధ్యాత్మిక, సామాజిక సేవా కార్యక్రమాల్లో ముందుండి పండుగలను ఘనంగా నిర్వహిస్తూ ప్రజలను ఏకతాటిపైకి తీసుకురావడం అభినందనీయమని అన్నారు. శ్రీకాంత్ రెడ్డి భవిష్యత్తులో మరిన్ని ప్రజాహిత కార్యక్రమాలు చేపట్టాలని ఆకాంక్షించారు.
అమ్మవార్ల ఆశీస్సులతో నియోజకవర్గ ప్రజలు, పరిసర ప్రాంతాల ప్రజలంతా సుఖసంతోషాలతో, శాంతిభద్రతలతో జీవించాలని సీఐ జగన్నాథ్ ఆకాంక్షించారు.
కార్యక్రమంలో ఎస్సై విజయ భాస్కర్ రెడ్డి, ఆలయ కమిటీ సభ్యులు, స్థానిక నాయకులు, ప్రజాప్రతినిధులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

