ప్రజావాణి,నంగునూరు ఆగస్టు 31:
నమ్మదగిన సమాచారం మేరకు రాజగోపాల్‌పేట పోలీసులు, సిద్దిపేట టాస్క్‌ఫోర్స్ సిబ్బంది సంయుక్తంగా నిర్వహించిన తనిఖీల్లో అక్రమంగా నిల్వ ఉంచిన బియ్యం సంచులను స్వాధీనం చేసుకున్నారు.
సోమవారం ఉదయం సుమారు 11 గంటల సమయంలో నంగునూరు మండలం రాంచంద్రాపూర్ మధిర గ్రామంలో పోలీసులు తనిఖీలు చేపట్టారు. గ్రామానికి చెందిన మోతె సాయి తరుణ్ (24) ఇంటి ఆవరణలోని రేకుల షెడ్‌లో, అలాగే ఇంటి ముందు అక్రమంగా నిల్వ ఉంచిన సుమారు 150 సంచుల బియ్యాన్ని పోలీసులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు.
స్వాధీనం చేసుకున్న బియ్యాన్ని తదుపరి చర్యల నిమిత్తం సివిల్ సప్లైస్ శాఖ అధికారులకు అప్పగించినట్లు రాజగోపాల్‌పేట పోలీస్ స్టేషన్ ఎస్‌ఐ వివేక్ తెలిపారు. బియ్యాన్ని అక్రమంగా నిల్వ ఉంచిన ఘటనపై సివిల్ సప్లైస్ అధికారులు నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోనున్నట్లు పేర్కొన్నారు.
అక్రమంగా బియ్యం నిల్వ చేయడం, తరలించడం వంటి చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.

