EVENING EDITION
📄 ePaper
Friday, September 11, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణSuryapetలిఫ్టుల రక్షణ రైతు బాధ్యత. దొంగతనాలకు చెక్ పెడదాం. ...

లిఫ్టుల రక్షణ రైతు బాధ్యత. దొంగతనాలకు చెక్ పెడదాం. సూర్యాపేట జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో రైతులకు అవగాహన సదస్సు.

📰 Generate e-Paper Clip

లిఫ్టుల రక్షణ రైతు బాధ్యత.

 

దొంగతనాలకు చెక్ పెడదాం.

 

సూర్యాపేట జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో రైతులకు అవగాహన సదస్సు.

హాజరైన కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్, ఎస్పీ నరసింహ, ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి.

 

మఠంపల్లి జూలై 30 (ప్రజావాణి)

 

వ్యవసాయానికి ప్రాణాధారమైన లిఫ్ట్ ఇరిగేషన్ పథకాల నిర్వహణ, భద్రతతో పాటు ట్రాన్స్‌ఫార్మర్లు, మోటార్ల దొంగతనాల నివారణే ధ్యేయంగా సూర్యాపేట జిల్లా పోలీసు యంత్రాంగం ముందడుగు వేసింది. హుజూర్ నగర్, కోదాడ నియోజకవర్గాల పరిధిలోని రైతులు, ఇరిగేషన్, విద్యుత్, వ్యవసాయ అధికారులతో కలిసి హుజూర్ నగర్ పోలీసుల ఆధ్వర్యంలో గురువారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సమావేశానికి జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్, జిల్లా ఎస్పీ నరసింహ, కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

 

రైతు కమిటీలు వేసి పర్యవేక్షించాలి: కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్.

 

కోట్ల రూపాయల వ్యయంతో ప్రభుత్వం ఏర్పాటు చేసిన లిఫ్ట్ ఇరిగేషన్లలో ట్రాన్స్‌ఫార్మర్లు, మోటార్లు, వైర్లు, ఆయిల్ దొంగతనానికి గురైతే చివరకు తీవ్రంగా నష్టపోయేది రైతాంగమేనని కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ ఆవేదన వ్యక్తం చేశారు. దొంగతనాలు జరిగాక పోలీసులు ఇతర రాష్ట్రాలకు వెళ్లి నిందితులను పట్టుకొని సొత్తు రికవరీ చేస్తున్నారని, అయితే దొంగతనాలు జరగకుండా ముందస్తుగా అడ్డుకోవడమే ముఖ్యమని స్పష్టం చేశారు.

సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని, ప్రతి లిఫ్ట్ పరిధిలో రైతులు సహకార సొసైటీలు, కమిటీలుగా ఏర్పడి నిరంతరం పర్యవేక్షించుకోవాలని సూచించారు. రైతుల కమిటీల ఏర్పాటు అంశాన్ని ప్రభుత్వం, ఇరిగేషన్ మంత్రి దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. లిఫ్టుల వద్ద తప్పనిసరిగా సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేయాలన్నారు. ఎల్ నినో ప్రభావంతో వర్షపాతం తగ్గే అవకాశమున్నందున, రైతులు నీటిని ఆదా చేస్తూ తక్కువ నీటితో పండే పంటలను సాగు చేయడానికి ప్రాధాన్యం ఇవ్వాలని పిలుపునిచ్చారు.

 

రైతులకు పోలీసుల అండ, పెట్రోలింగ్ ముమ్మరం: ఎస్పీ నరసింహ.

 

దేశానికి వెన్నుముక అయిన రైతన్నలకు పోలీసు శాఖ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని ఎస్పీ నరసింహ స్పష్టం చేశారు. నివాస ప్రాంతాలకు దూరంగా ఉన్న లిఫ్ట్ పథకాలనే లక్ష్యంగా చేసుకుని దొంగలు వైర్లు, ఆయిల్, ట్రాన్స్‌ఫార్మర్లు ఎత్తుకెళ్తున్నారని తెలిపారు. రైతుల మధ్య ఐకమత్యం, సామాజిక బాధ్యత పెరిగినప్పుడే దొంగతనాలకు చెక్ పెట్టవచ్చన్నారు. పోలీసు శాఖ తరఫున లిఫ్టుల వద్ద పాయింట్ బుక్స్ ఏర్పాటు చేసి, నిరంతరం పెట్రోలింగ్ నిర్వహిస్తామని ఎస్పీ హామీ ఇచ్చారు. దొంగతనాల నిర్మూలనలో రైతులు కూడా పోలీసులకు సహకరించాలని కోరారు.

 

లిఫ్టులను సొంత ఆస్తిగా భావించాలి: ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి.

 

ప్రభుత్వం రైతుల సంక్షేమం, వ్యవసాయ అభివృద్ధి కోసం ఏర్పాటు చేస్తున్న లిఫ్ట్ ఇరిగేషన్లను రైతులు తమ సొంత ఆస్తిగా భావించి రక్షించుకోవాలని కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి కోరారు. లిఫ్టులలో దొంగతనాలు జరిగితే సాగునీరు అందక రైతులే నష్టపోతారని అన్నారు.

వ్యవసాయ రంగానికి నిరంతర నీరందించేందుకు ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అనుక్షణం కృషి చేస్తున్నారని తెలిపారు. రైతుల ప్రయోజనాల కోసం, దొంగతనాల నివారణే ధ్యేయంగా ఇన్ని శాఖలను ఒకే వేదికపైకి తెచ్చి భారీ అవగాహన సదస్సు నిర్వహించిన జిల్లా పోలీసు యంత్రాంగాన్ని, ఎస్పీ నరసింహను ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి ప్రత్యేకంగా అభినందించారు.

 

ఈ కార్యక్రమంలో రెవెన్యూ డివిజన్ అధికారి సూర్యనారాయణ, ఇరిగేషన్ సిఇ నాగభూషణం, విద్యుత్ డిఇ రామ్మోహన్ రెడ్డి, డీఎస్పీ శ్రీనివాస్, తహసిల్దార్ కవిత ఇరిగేషన్, వ్యవసాయ శాఖల అధికారులు, హుజూర్ నగర్, కోదాడ నియోజకవర్గాల పోలీసు అధికారులు, ప్రజాప్రతినిధులు, రెండు నియోజకవర్గాల పరిధిలోని రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.