📄 ePaper
Epaper 2
Thursday, September 17, 2026
📄 ePaper
EVENING EDITION
Homeఆంధ్రప్రదేశ్ఏపీ రైతులకు అలర్ట్.. వ్యవసాయ శాఖ కొత్త రూల్స్.. ఆధార్ ఉంటేనే.. ఏపీలో ఎరువుల బ్లాక్...

ఏపీ రైతులకు అలర్ట్.. వ్యవసాయ శాఖ కొత్త రూల్స్.. ఆధార్ ఉంటేనే.. ఏపీలో ఎరువుల బ్లాక్ మార్కెటింగ్‌కు అడ్డుకట్ట

📰 Generate e-Paper Clip

అమరావతి,జూన్ 7 ప్రజావాణి.రైతుకు ఎంత పొలం ఉంది ? అందులో ఏ పంట సాగు చేశారు ? దానికి శాస్త్రీయంగా ఎంత మోతాదులో ఎరువులు అవసరం ? అనే లెక్కల ఆధారంగానే ఇకపై ఎరువులను విక్రయించనున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా రూపొందించిన అగ్రికల్చర్‌ ప్రొడ్యూస్‌ అండ్‌ ఇన్‌పుట్స్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టమ్‌ (APAIMS) యాప్ ద్వారా రేపటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా యూరియా, డీఏపీ విక్రయాలు ప్రారంభం కానున్నాయి. అయితే పైలట్ ప్రాజెక్ట్ కింద కేంద్ర ప్రభుత్వ యాప్‌ను అమలు చేస్తున్న కృష్ణా, కాకినాడ జిల్లాలకు మాత్రం ఈ ఏపీఏఐఎంఎస్ యాప్ విధానం నుండి మినహాయింపు ఇచ్చారు.వ్యవసాయ శాఖ ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ఈ యాప్‌లో భూమి కలిగిన రైతులు తమ ఆధార్ నంబరుతో నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ యాప్ రెవెన్యూ శాఖకు చెందిన వెబ్‌ల్యాండ్ పోర్టల్‌తో అనుసంధానం కావడం వల్ల, రైతు ఆధార్ ఎంటర్ చేయగానే అతని భూమి వివరాలు, గ్రామాల వారీగా, సర్వే నంబర్ల వారీగా ఉన్న విస్తీర్ణం స్క్రీన్‌పై ప్రత్యక్షమవుతాయి. ప్రస్తుత ఖరీఫ్ సీజన్లలో తాము వేయదలచుకున్న పంట వివరాలను రైతులు ఇందులో నమోదు చేయాలి. ఆ పంట విస్తీర్ణానికి వ్యవసాయ శాస్త్రవేత్తల సిఫార్సుల మేరకు ఎంత ఎరువు అవసరమో యాప్ లెక్కిస్తుంది. పంట కాలంలో మొదటి విడతగా ఎంత వేయాలి, రెండో విడతగా ఎంత ఇవ్వాలనేది స్పష్టంగా చూపిస్తుంది.అక్కడే స్థానికంగా అందుబాటులో ఉన్న ఎరువుల దుకాణాల జాబితా ఉంటుంది. రైతులు తమకు నచ్చిన దుకాణాన్ని ఎంచుకుని, రిజిస్టర్డ్ మొబైల్‌కు వచ్చే ఓటీపీ ద్వారా దుకాణదారుడి నుంచి నిబంధనల మేరకు విడతల వారీగా ఎరువులు కొనుగోలు చేయవచ్చు. అర్హులైన, వాస్తవ సాగుదారులైన రైతులందరికీ పారదర్శకంగా ఎరువులు అందించేందుకే ఈ డిజిటల్ విధానాన్ని తీసుకొచ్చినట్లు వ్యవసాయ శాఖ డైరెక్టర్ మనజీర్ జిలాని సమూన్ తెలిపారు. సోమవారం నుంచి వ్యవసాయ శాఖ క్షేత్రస్థాయి అధికారులు గ్రామాల్లో పర్యటించి రైతులు, రైతు సంఘాలు, అభ్యుదయ రైతులు, ఎరువుల డీలర్లకు ఈ సరికొత్త యాప్ పనితీరుపై విస్తృత అవగాహన కల్పించాలని ఆయన సూచించారు.ఈ యాప్ విధానం సొంత భూమి ఉన్న రైతులకు సులభతరంగానే ఉన్నప్పటికీ, రాష్ట్రంలోని సుమారు 22 లక్షల మంది కౌలు రైతుల పరిస్థితిపై తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. యాప్ పూర్తిగా వెబ్‌ల్యాండ్ ఆధారంగా పనిచేస్తుండటంతో కౌలుదారులకు ఎరువులు ఎలా లభిస్తాయనేది ప్రశ్నార్థకంగా మారింది. ప్రభుత్వం ఈ-పంట నమోదు, సాగుదారు హక్కు కార్డుల ఆధారంగా కౌలు రైతులకు ఎరువులు అందిస్తామని చెబుతున్నప్పటికీ క్షేత్రస్థాయి వాస్తవాలు భిన్నంగా ఉన్నాయి. రెవెన్యూ, వ్యవసాయ అధికారులు సీసీఆర్‌సీ కార్డుల జారీ ప్రక్రియను, ఈ-పంట నమోదును పూర్తి చేసేసరికి జూలై లేదా ఆగస్టు నెలలు అవుతాయి.అప్పటికే ఖరీఫ్ కీలక సాగుదశ ముగుస్తుంది. దీనికి తోడు, కౌలు కార్డు ఇవ్వాలంటే భూయజమాని సంతకం, అంగీకారం తప్పనిసరి. కానీ, భవిష్యత్తులో భూమిపై హక్కుల సమస్యలు వస్తాయనే భయంతో మెజారిటీ యజమానులు అనధికారికంగానే కౌలుకు ఇస్తూ కార్డులపై సంతకాలు చేయడానికి నిరాకరిస్తున్నారు. ఈ సాంకేతిక, సామాజిక ఇబ్బందుల వల్ల కౌలు రైతులు ఎరువుల కొరతను ఎదుర్కొనే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.