ఘట్‌కేసర్, ఏప్రిల్ 26(ప్రజావాణి): తెలంగాణ ప్రభుత్వం షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో సంక్షేమ వారోత్సవాల సందర్భంగా ఘట్‌కేసర్ ప్రాంతంలో “హాస్టల్ బాట” కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్సీ డెవలప్మెంట్ అధికారి జీ. వినోద్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఘట్‌కేసర్‌లోని ఎస్సీ బస్తీలలో నివసిస్తున్న విద్యార్థుల తల్లిదండ్రులను నేరుగా కలుసుకుని, వారి పిల్లలను ప్రభుత్వ హాస్టళ్లలో చేర్పించాలని అధికారులు విజ్ఞప్తి చేశారు. హాస్టళ్లలో అందుబాటులో ఉన్న మెరుగైన వసతులు, ఉచిత విద్యా సదుపాయాలు, పోషకాహారం వంటి అంశాలను వివరించారు. పిల్లల విద్యాభివృద్ధికి ప్రభుత్వం విస్తృతంగా చర్యలు తీసుకుంటోందని తెలిపారు.
అధికారుల సూచనలకు తల్లిదండ్రులు సానుకూలంగా స్పందిస్తూ, తమ పిల్లలను హాస్టళ్లలో చేర్పించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థులకు మెరుగైన భవిష్యత్తు సాధ్యమవుతుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ ఎస్సీ డెవలప్మెంట్ ఆఫీసర్ గోపీచంద్, హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్లు ధాన్య నాయక్, కాంతి రెడ్డి, మహేష్, లక్ష్మయ్య, కృష్ణ, ఊర్మిళతో పాటు విద్యార్థులు, వారి తల్లిదండ్రులు మరియు స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

