రైస్ మిల్ దుమ్ము.. ఆయిల్ మిల్ వాసనతో వాహనదారులకు నరకయాతన
బెజ్జంకి క్రాసింగ్ –గుగ్గిళ్ల గ్రామ రహదారిపై పెరుగుతున్న కాలుష్యం
బెజ్జంకి, మే 14 (ప్రజావాణి)
సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని బెజ్జంకి క్రాసింగ్ నుండి గుగ్గిళ్ల గ్రామానికి వెళ్లే రహదారిపై దుమ్ము సమస్య తీవ్రరూపం దాల్చింది. రహదారి పక్కనే ఉన్న రైస్ మిల్, ఆయిల్ మిల్ల నుండి వెలువడుతున్న పొడి దుమ్ము, పొగ, దుర్వాసనలతో ఆ మార్గంలో ప్రయాణించే ప్రజలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ప్రత్యేకంగా ద్విచక్ర వాహనదారులు దుమ్ము కారణంగా కళ్లలో మంటలు, శ్వాస సంబంధిత సమస్యలు ఎదుర్కొంటున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.దుమ్ము అధికంగా గాలిలోకి ఎగరడంతో ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించక ప్రమాదాలు జరిగే అవకాశం పెరిగిందని తెలిపారు.ఈ యొక్క దుమ్ము వల్ల ఇప్పటికే పలువురు వాహనదారులు కిందపడిన ఘటనలు చోటుచేసుకున్నాయని పేర్కొన్నారు.
రైస్ మిల్, ఆయిల్ మిల్ల నుండి వెలువడుతున్న దుమ్ము, వాసనలను నియంత్రించేలా సంబంధిత అధికారులు, గుగ్గిళ్ల గ్రామ సర్పంచ్ ప్రత్యేక చొరవ తీసుకొని వెంటనే చర్యలు తీసుకోవాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు.ఇప్పటికైనా అధికారులు స్పందించి ఆకస్మిక తనిఖీలు నిర్వహించి గ్రామ ప్రజలు, వాహనదారులకు ఇబ్బందులు లేకుండా చూడాలని స్థానికులు, వాహన దారులు కోరుతున్నారు.



