ప్రభుత్వ కార్యక్రమాల్లో ప్రోటోకాల్ పాటించాలి: బీఆర్ఎస్ నాయకుడు రామకృష్ణ
షాద్‌నగర్, జూన్ 07 (ప్రజావాణి): ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల నిర్వహణలో స్థానిక ప్రజాప్రతినిధులకు తగిన గౌరవం, ప్రాధాన్యత ఇవ్వాలని బీఆర్ఎస్ నాయకుడు, కొందుర్గ్ మాజీ జడ్పీటీసీ తనయుడు రామకృష్ణ డిమాండ్ చేశారు.
కాంగ్రెస్ నాయకుడు కృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యలకు స్పందించిన ఆయన, కేసీఆర్ పాలనలో ప్రజలకు “చిప్ప చేతికి ఇచ్చారు” అనే వ్యాఖ్యలు పూర్తిగా నిరాధారమని విమర్శించారు. నిజంగా ప్రజలకు నష్టం జరిగి ఉంటే తెలంగాణ ప్రజలు వరుసగా రెండు సార్లు బీఆర్ఎస్‌కు పూర్తి మెజారిటీ ఎందుకు ఇచ్చారో కాంగ్రెస్ నాయకులు సమాధానం చెప్పాలని ప్రశ్నించారు.
కేసీఆర్ హయాంలో రైతుబంధు, రైతు బీమా, 24 గంటల ఉచిత విద్యుత్, కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, కొత్త జిల్లాలు, వైద్య కళాశాలలు, గురుకులాల విస్తరణ వంటి అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేశారని గుర్తు చేశారు.
అలాగే ఇటీవల నిర్వహించిన ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమాల సందర్భంగా స్థానిక సర్పంచులను ఆహ్వానించకపోవడంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిధులతో నిర్మించిన ఇళ్ల పంపిణీ, గృహప్రవేశ కార్యక్రమాల్లో గ్రామ ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులకు సమాచారం ఇవ్వడం, కార్యక్రమాలకు ఆహ్వానించడం అధికారుల బాధ్యత అని పేర్కొన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం లక్ష గృహాల ప్రారంభోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తున్న రోజునే రేగడి చిల్కమర్రి గ్రామంలో ఇందిరమ్మ గృహప్రవేశ కార్యక్రమం నిర్వహించారని, అటువంటి సందర్భాల్లో ప్రభుత్వ ప్రోటోకాల్ అమల్లో ఉంటుందా లేదా అనే విషయాన్ని కాంగ్రెస్ నాయకులు స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు.
“గృహప్రవేశానికి ఇంటి యజమాని పిలవాలి” అనే వ్యాఖ్య ప్రభుత్వ పథకాల కింద జరిగే కార్యక్రమాలకు వర్తించదని, ప్రజా ప్రతినిధుల హక్కులు, గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు.
గ్రామాల అభివృద్ధి కోసం పార్టీలు అతీతంగా కలిసి పనిచేయాలని, ప్రభుత్వ కార్యక్రమాల్లో అన్ని వర్గాల ప్రజాప్రతినిధులకు తగిన గౌరవం, ప్రాధాన్యత కల్పించాలని రామకృష్ణ కోరారు.
ప్రభుత్వ కార్యక్రమాల్లో ప్రోటోకాల్ పాటించాలి బీఆర్ఎస్ నాయకుడు రామకృష్ణ
RELATED ARTICLES




