ఘట్‌కేసర్, జూలై 27 (ప్రజావాణి): మేడ్చల్–మల్కాజ్‌గిరి పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పోచారం ఐటీ కారిడార్ పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ (సీఐ)గా జి. జగన్నాథ్ బాధ్యతలు స్వీకరించారు. 2009 బ్యాచ్‌కు చెందిన ఆయన ఇటీవల మల్కాజ్‌గిరి పోలీస్ స్టేషన్‌లో డివిజనల్ ఇన్‌స్పెక్టర్ (డీఐ)గా విధులు నిర్వహించి, బదిలీపై పోచారం సీఐగా నియమితులయ్యారు.
విధుల్లో అనుభవం, సమర్థవంతమైన పనితీరుకు పేరుగాంచిన జి. జగన్నాథ్ బాధ్యతలు చేపట్టిన సందర్భంగా పోలీసు అధికారులు, సిబ్బంది ఆయనకు ఘన స్వాగతం పలికి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా నూతన సీఐ జి. జగన్నాథ్ మాట్లాడుతూ ప్రజలకు అందుబాటులో ఉండే పోలీసింగ్ అందించడం తన ప్రధాన లక్ష్యమని తెలిపారు. శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణ, మహిళల భద్రత, ప్రజలకు వేగవంతమైన సేవలు అందించడంపై ప్రత్యేక దృష్టి సారిస్తానన్నారు. పోలీసు–ప్రజల మధ్య సమన్వయాన్ని మరింత బలోపేతం చేసి, ప్రతి ఫిర్యాదును పారదర్శకంగా, వేగంగా పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.
పోచారం ఐటీ కారిడార్ పోలీస్ స్టేషన్ పరిధిలో చట్టవ్యతిరేక కార్యకలాపాలు, అక్రమాలు, శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చర్యలపై రాజీ లేకుండా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజలు ఎలాంటి సమస్య వచ్చినా నిర్భయంగా పోలీసులను సంప్రదించాలని, ప్రజల సహకారంతోనే సమాజంలో శాంతిభద్రతలను మరింత పటిష్ఠం చేయగలమని ఆయన అన్నారు.
నూతన సీఐగా జి. జగన్నాథ్ బాధ్యతలు స్వీకరించడంతో పోచారం పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసింగ్ మరింత సమర్థవంతంగా కొనసాగుతుందనే ఆశాభావాన్ని స్థానిక ప్రజలు వ్యక్తం చేస్తున్నారు.



