బెజ్జంకి, జూన్ 14 (ప్రజావాణి)
సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల వ్యాప్తంగా ఉన్న విత్తనాలు, ఎరువులు, పురుగుమందుల దుకాణాల్లో ప్రత్యేకంగా ఆకస్మిక తనిఖీలు నిర్వహించి నకిలీ ఉత్పత్తుల విక్రయాలను అరికట్టాలని అఖిల భారత యువజన సమాఖ్య (AIYF) బెజ్జంకి మండల కార్యదర్శి దొంతరవేణి మహేష్ డిమాండ్ చేశారు.రైతులు ఖరీఫ్ సాగుకు సిద్ధమవుతున్న ఈ సమయంలో మార్కెట్లో నకిలీ విత్తనాలు, నాణ్యతలేని ఎరువులు, పురుగుమందులు విక్రయమవుతున్నాయని, దీంతో రైతులు ఆర్థికంగా నష్టపోయే ప్రమాదం ఉందన్నారు. వ్యవసాయ శాఖ అధికారులు మండలంలోని అన్ని దుకాణాలను క్షుణ్ణంగా తనిఖీ చేసి నాణ్యత ప్రమాణాలు పాటించని వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారవిత్తనాలు, ఎరువుల నమూనాలను సేకరించి ప్రయోగశాల పరీక్షలకు పంపడంతో పాటు గడువు ముగిసిన లేదా నకిలీ ఉత్పత్తులను విక్రయిస్తున్న దుకాణాల లైసెన్సులను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. రైతులు కొనుగోలు చేసే సమయంలో తప్పనిసరిగా బిల్లులు తీసుకునేలా అవగాహన కల్పించాలని, దుకాణాల వద్ద నిల్వలు, విక్రయాలు, ధరల వివరాలను బోర్డులపై ప్రదర్శించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.వ్యవసాయ అధికారులు ముందస్తు సమాచారం లేకుండా ఆకస్మిక తనిఖీలు నిర్వహించి అక్రమాలకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, రైతు వేదికల ద్వారా నకిలీ విత్తనాలపై అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని AIYF మండల సమితి పక్షాన విజ్ఞప్తి చేశారు.




