రెండు గంటల్లోనే తప్పిపోయిన వృద్ధురాలిని గుర్తించిన పెనుమూరు పోలీసులు
సీసీ కెమెరాల సహకారంతో కాణిపాకంలో సురక్షితంగా గుర్తింపు.. కుటుంబ సభ్యులకు అప్పగింత
పెనుమూరు ( ప్రజావాణి ప్రతినిధి )ఆగస్ట్6
చిత్తూరు జిల్లా పెనుమూరు మండలం చిప్పారపల్లి గ్రామానికి చెందిన 68 ఏళ్ల టి. సరోజమ్మ కనిపించకుండా పోయిన ఘటనలో పెనుమూరు పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి కేవలం రెండు గంటల్లోనే ఆమెను సురక్షితంగా గుర్తించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఈ ఘటనలో సీసీ కెమెరాల సాంకేతిక సహకారం కీలక పాత్ర పోషించింది.
పోలీసుల వివరాల ప్రకారం.. ఈ నెల 2వ తేదీ నుంచి సరోజమ్మ కనిపించకుండా పోవడంతో ఆమె చిన్న కుమారుడు టి. పవన్ కళ్యాణ్ గురువారం పెనుమూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు అందిన వెంటనే జిల్లా ఎస్పీ తుషార్ డూడి, ఐపీఎస్ ఆదేశాల మేరకు, చిత్తూరు ఎస్డిపిఓ జె. వెంకట్ నారాయణ పర్యవేక్షణలో, ఈస్ట్ సర్కిల్ ఇన్స్పెక్టర్ కె. రామచంద్ర ఆధ్వర్యంలో ఎస్ఐ డి. శ్రీనివాసులు ప్రత్యేక బృందంతో గాలింపు చర్యలు ప్రారంభించారు.
గ్రామం, పెనుమూరు బస్టాండ్ పరిసరాల్లోని సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలించగా, సరోజమ్మ పెనుమూరు నుంచి ఆర్టీసీ బస్సులో చిత్తూరు చేరుకుని, అక్కడి నుంచి కాణిపాకానికి వెళ్లినట్లు గుర్తించారు. వెంటనే చిత్తూరు, కాణిపాకం ప్రాంతాల్లో విస్తృతంగా గాలింపు చేపట్టి, కాణిపాకం ఆలయ ప్రాంగణంలో ఆమెను సురక్షితంగా గుర్తించారు.
విచారణలో తాను ఐదు రోజుల పాటు దేవుని సన్నిధిలో ఉండి మొక్కులు తీర్చుకోవాలనే ఉద్దేశంతో కాణిపాకం వెళ్లినట్లు సరోజమ్మ వెల్లడించారు. అయితే ఈ విషయాన్ని కుటుంబ సభ్యులకు, బంధువులకు లేదా గ్రామస్తులకు ముందుగా తెలియజేయలేదని చెప్పారు.
పోలీసులు వెంటనే ఆమెను పెనుమూరుకు తీసుకొచ్చి, ఫిర్యాదు అందిన రెండు గంటల్లోనే కుటుంబ సభ్యులకు అప్పగించారు. ప్రస్తుతం ఆమె క్షేమంగా ఉన్నారు.
ఈ సందర్భంగా పెనుమూరు పోలీసులు మాట్లాడుతూ.. ప్రజల భద్రత కోసం సీసీ కెమెరాలు ఎంతో ఉపయోగపడుతున్నాయని, ఈ ఘటనలో కూడా వాటి సహకారంతో వేగంగా ఆచూకీ లభించిందని తెలిపారు. అలాగే వృద్ధులు, మహిళలు, చిన్నారులు బయటకు వెళ్లే సమయంలో తప్పనిసరిగా కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వాలని, అత్యవసర పరిస్థితుల్లో పోలీసులకు వెంటనే సమాచారం అందించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
తప్పిపోయిన వృద్ధురాలని రెండు గంటల్లో గుర్తించిన పెనుమూరు పోలీసులు
RELATED ARTICLES




