నేరేడుచర్ల, ప్రజావాణి జూన్ 23: నేరేడుచర్ల పట్టణానికి చెందిన తాళ్ల కాశమ్మ (55), భర్త కోటేశ్వరరావు, అనే మహిళపై కత్తితో దాడి జరిగిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. వివరాల ప్రకారం, నేరేడుచర్లకు చెందిన షేక్ సుభాన్‌తో కాశమ్మకు కొంతకాలంగా పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలో ఇద్దరూ కలిసి మిర్యాలగూడలో అద్దె గదిలో నివాసం ఉంటున్నారు.
అయితే కాశమ్మ ఆరోగ్యం బాగాలేకపోవడంతో గత రెండు నెలలుగా సుభాన్‌ను విడిచి నేరేడుచర్లలో తాను దత్తత తీసుకున్న కుమారుడి వద్ద నివసిస్తోంది. ఈ నేపథ్యంలో కాశమ్మ తన వద్దకు రావడం లేదనే ఆగ్రహంతో షేక్ సుభాన్ మంగళవారం (జూన్ 23) ఉదయం సుమారు 11:30 గంటల సమయంలో కాశమ్మ ఇంటికి వెళ్లాడు.
ఆ సమయంలో ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్న కాశమ్మపై కూరగాయలు కోసే కత్తితో కడుపు భాగంలో మూడు సార్లు పొడిచినట్లు సమాచారం. దీంతో ఆమెకు తీవ్ర రక్తస్రావం కాగా, కుటుంబ సభ్యులు వెంటనే మిర్యాలగూడ ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు.
ప్రస్తుతం కాశమ్మ ఆరోగ్య పరిస్థితి మెరుగుపడటంతో వైద్యులు డిశ్చార్జ్ చేసినట్లు తెలిసింది. ఈ ఘటనపై నేరేడుచర్ల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.




