📄 ePaper
Tuesday, July 7, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్కొప్పలకొండలో అడ్డగోలుగా మట్టి దోపిడీ: అధికారుల అండతోనే కార్పొరేట్ సంస్థల హల్చల్?

కొప్పలకొండలో అడ్డగోలుగా మట్టి దోపిడీ: అధికారుల అండతోనే కార్పొరేట్ సంస్థల హల్చల్?

📰 Generate e-Paper Clip

అనంతపురం జిల్లా జూలై 06 ప్రజావాణి గార్లదిన్నె మండలం కొప్పలకొండ పంచాయతీ పరిధిలో సర్వే నెంబర్ 568 అక్రమ మట్టి తవ్వకాలు, తరలింపు యథేచ్ఛగా సాగుతున్నాయి. ఎటువంటి అనుమతులు లేకుండానే ఒక ప్రముఖ కార్పొరేట్ సంస్థ రాత్రిపగలు తేడా లేకుండా జేసీబీలు,ట్రాక్టర్లతో కొండలను,భూములను తవ్వేస్తూ మట్టిని తరలిస్తోంది.స్థానిక రెవెన్యూ శాఖకు చెందిన ఒక వీఆర్వో  ప్రత్యక్ష పర్యవేక్షణ,అండదండలతోనే ఈ వ్యవహారం నడుస్తోందని గ్రామస్థులు బహిరంగంగానే ఆరోపిస్తున్నారు.
ముడుపుల పర్వంపై గ్రామస్థుల గుసగుసలు
సాధారణ ప్రజలు ఇళ్ల నిర్మాణానికి లేదా పొలాల అవసరాలకు ట్రాక్టర్ మట్టి తీసుకెళ్లాలన్నా నిబంధనల పేరిట నానా హంగామా చేసే అధికారులు, ఇంత పెద్ద ఎత్తున కార్పొరేట్ సంస్థ ప్రభుత్వ సంపదను దోచుకెళ్తున్నా కన్నెత్తి చూడకపోవడం వెనుక భారీ ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ అక్రమ తవ్వకాలకు అనుమతి ఇవ్వడానికి సదరు కార్పొరేట్ సంస్థ నుంచి రెవెన్యూ శాఖలోని కొందరు ఉన్నతాధికారులకు, స్థానిక సిబ్బందికి లక్షల రూపాయల ముడుపులు (లంచాలు) అందాయని గ్రామ ప్రజలు తీవ్రస్థాయిలో గుసగుసలాడుకుంటున్నారు. “అధికారుల జేబులు నిండబట్టే.. ఇక్కడ మట్టి మాఫియా స్వైరవిహారం చేస్తోంది” అని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
నిబంధనలకు పాతర.. పర్యావరణానికి ముప్పు
మైనింగ్, భూగర్భ గనుల శాఖ నుంచి ఎలాంటి రాయల్టీ రసీదులు లేదా అనుమతి పత్రాలు లేకుండానే భారీ యంత్రాలను రంగంలోకి దించారు.నిబంధనల ప్రకారం మైనింగ్ జోన్ పరిధి దాటి తవ్వకాలు జరపకూడదు. కానీ ఇక్కడ కొప్పలకొండ పంచాయతీ పరిధిలో కొండల రూపురేఖలను మార్చేస్తూ అక్రమార్కులు రెచ్చిపోతున్నారు. దీనివల్ల స్థానికంగా పర్యావరణ సమతుల్యత దెబ్బతినడమే కాకుండా, భవిష్యత్తులో భూగర్భ జలాల మట్టం పడిపోయే ప్రమాదం ఉందని పర్యావరణ ప్రేమికులు హెచ్చరిస్తున్నారు.జిల్లా కలెక్టర్,మైనింగ్ శాఖ ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి కొప్పలకొండ పంచాయతీలో జరుగుతున్న ఈ అక్రమ మట్టి తోలకాలను నిలిపివేయాలని,దీని వెనుక ఉన్న కార్పొరేట్ సంస్థపై మరియు లంచాలకు ఆశపడి సహకరిస్తున్న రెవెన్యూ సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని గ్రామ ప్రజలు, ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.భవిష్యత్తులో ఈ దోపిడీ ఇలాగే సాగితే పెద్ద ఎత్తున ప్రజా ఆందోళనలు చేపడతామని హెచ్చరిస్తున్నారు

RELATED ARTICLES
- Advertisment -

Most Popular