*కనక దుర్గమ్మ ఆలయ సిమెంట్ రోడ్డు పనులకు రెవెన్యూ, పోలీసు ప్రొటెక్షన్ కల్పించాలని వినతి*
రాయికల్: మే 30 (ప్రజావాణి)

రాయికల్ మండలంలోని మహితాపూర్ గ్రామపంచాయతీ పరిధిలోని గన్నే గుట్టపై గల శ్రీ కనక దుర్గమ్మ సన్నిధికి వెళ్లే సిమెంట్ రోడ్డు పనులకు రెవెన్యూ, పోలీసు రక్షణ కల్పించాలని కోరుతూ వార్డు సభ్యులు శుక్రవారం అధికారులకు వినతిపత్రాలు అందజేశారు.వారు తెలిపిన వివరాల ప్రకారం
గన్నే గుట్టపై గల మరో విజయవాడ కనక దుర్గమ్మ సన్నిధి భక్తులకు ప్రసిద్ధి. ప్రతిరోజు ఉదయం, ప్రతి శుక్రవారం ఉదయం నుండి మధ్యాహ్నం 1 గంట వరకు, దసరా నవరాత్రుల్లో కోరుట్ల,మల్లాపూర్, ఇబ్రహీంపట్నం,మేడిపల్లి, జగిత్యాల, సారంగాపూర్ మండలాల నుండి భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చి మొక్కులు తీర్చుకుంటారని తెలిపారు.ఇటిక్యాల గ్రామానికి చెందిన చెన్నమని నివేదిత-వెంకట కృష్ణారావు దంపతుల చొరవతో ఆలయ నిర్మాణం, విగ్రహ ప్రతిష్ఠ జరిగిందని,రాజ్యసభ సభ్యులు దామోదర్ రావు నిధుల నుండి మెట్లు, సిమెంట్ రోడ్డుకు రూ.30 లక్షలు, మాజీ మంత్రి, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి నిధుల నుండి రెయిలింగ్‌కు రూ.4 లక్షలు మంజూరయ్యాయని అన్నారు.ఇటీవల దామోదర్ రావు నిధుల నుండి మరో రూ.15 లక్షలు మంజూరై సిమెంట్ రోడ్డు పనులు 70శాతం పూర్తయ్యాయని,మిగిలిన పనులు పూర్తి చేస్తుండగా, అక్కడి పట్టాదారులు “ఇక్కడి నుండి దారి లేదు. రోడ్డు వేస్తే కుటుంబ సభ్యులతో కలిసి ఆత్మహత్య చేసుకుంటాం” అంటూ బెదిరింపులకు, అసభ్య పదజాలానికి పాల్పడుతున్నారని వార్డు సభ్యులు ఆరోపించారు.ఆలయానికి సిమెంట్ రోడ్డు పనులు సజావుగా జరిగేందుకు రెవెన్యూ అధికారులు, సర్వే అధికారులు, పోలీసు అధికారులు,ముఖ్యంగా లేడీ కానిస్టేబుళ్లను డ్యూటీలో పెట్టాలని కోరారు. ఈ సందర్భంగా తహసీల్దార్ నాగార్జున, ఎస్సై సుధీర్ రావు లకు వినతిపత్రం అందజేశారు.ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ దొంగ ప్రణయ్ రెడ్డి,వార్డు సభ్యులు బూస గంగామల్లయ్య, అనుమల్ల రమ-సత్యనారాయణ, భూపెళ్లి పరమేష్,తొగిటి నవీన్ కుమార్, గ్రామ నాయకులు అనుమల్ల సత్యనారాయణ, కొల్ల కృష్ణారెడ్డి, పాలడుగు లింగారెడ్డి, ఆలయ క్యాషియర్ నాగిరెడ్డి, రఘుపతి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


