అలుగునూరు దీక్షా దివస్ స్ఫూర్తి సభకు పెద్దపల్లి నుంచి భారీగా తరలిరావాలి
బీఆర్ఎస్ శ్రేణులు, యువతకు మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి పిలుపు
ప్రతి గ్రామం నుంచి ప్రత్యేక బస్సుల ఏర్పాటు.. మధ్యాహ్నం ఒంటి గంటకే బయలుదేరాలి
ప్రజావాణి జిల్లా ప్రతినిధి
పెద్దపల్లి నవంబర్ 27
పెద్దపల్లి: తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిన దీక్షా దివస్ స్ఫూర్తిని చాటిచెప్పేందుకు కరీంనగర్ సమీపంలోని అలుగునూరులో నిర్వహించనున్న భారీ బహిరంగ సభకు పెద్దపల్లి నియోజకవర్గం నుంచి ప్రజలు, యువత, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో తరలిరావాలని మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నాయకుడు దాసరి మనోహర్ రెడ్డి పిలుపునిచ్చారు.
శుక్రవారం తన క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ చేపట్టిన నిరాహార దీక్ష చరిత్రలో ఒక కీలక మలుపుగా నిలిచిందని పేర్కొన్నారు. ‘కేసీఆర్ చచ్చుడో.. తెలంగాణ వచ్చుడో’ అనే నినాదంతో ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ఆయన చేపట్టిన దీక్ష ఫలితంగానే పార్లమెంటులో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ప్రారంభమైందని, అనంతరం 2014 జూన్ 2న ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిందని గుర్తుచేశారు.
తెలంగాణ సాధన కోసం జరిగిన పోరాటం, అమరుల త్యాగాలు, కేసీఆర్ నాయకత్వంలో సాగిన ఉద్యమ స్ఫూర్తిని భవిష్యత్ తరాలకు తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సభలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొని ప్రసంగించనున్నారని వెల్లడించారు.
ప్రతి గ్రామం నుంచి ప్రత్యేక బస్సులు
సభకు పెద్దపల్లి నియోజకవర్గం నుంచి ప్రజలు సులభంగా చేరుకునేందుకు ప్రతి గ్రామం నుంచి ఒక్కో బస్సును ఏర్పాటు చేసినట్లు దాసరి మనోహర్ రెడ్డి తెలిపారు. ఆయా గ్రామాల్లో యువకులు, నాయకుల పేర్లు, తండ్రి పేర్లు, సెల్ఫోన్ నంబర్లతో పాటు బస్సు ఇన్ఛార్జీల వివరాలను సేకరించినట్లు చెప్పారు. ఇంకా ఎక్కడైనా వివరాలు నమోదు కాకపోతే శుక్రవారం సాయంత్రంలోపు అందజేసి ప్రయాణ ఏర్పాట్లను పూర్తి చేయాలని సూచించారు.
సభకు సమయానికి చేరుకోవాలి
ఆదివారం నిర్వహించనున్న బహిరంగ సభకు పెద్దపల్లి నియోజకవర్గంలోని ప్రతి గ్రామం నుంచి మధ్యాహ్నం ఒంటి గంటకు బస్సులు బయలుదేరాలని, మధ్యాహ్నం 3:30 నుంచి 4 గంటలలోపు సభా ప్రాంగణానికి చేరుకోవాలని సూచించారు. సభ సాయంత్రం 5:30 నుంచి 6 గంటలలోపు ముగిసే అవకాశం ఉందని తెలిపారు.
తెలంగాణ రాష్ట్ర సాధనలో భాగస్వాములైన ప్రతి ఒక్కరూ ఉద్యమ స్ఫూర్తిని గుర్తుచేసుకుంటూ ఈ సభకు హాజరుకావాలని, యువత అధిక సంఖ్యలో పాల్గొని సభను విజయవంతం చేయాలని దాసరి మనోహర్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.
ఈ సమావేశంలో పెద్దపల్లి పట్టణ బీఆర్ఎస్ అధ్యక్షుడు ఉప్పు రాజ్ కుమార్, నాయకులు సలేంద్ర రాములు, పూదరి చంద్రశేఖర్, కారిపాకల సంపత్, నాగరాజు, పల్లె మధు తదితరులు పాల్గొన్నారు.

