📄 ePaper
5pm
7pm
Friday, November 27, 2026
📄 ePaper
5pm epaper
7pm epaper
Homeతెలంగాణనిరుద్యోగ యువతకు దాసరి ఉష అండ.. మహిళా మెగా జాబ్ మేళాతో 400 మందికి పైగా...

నిరుద్యోగ యువతకు దాసరి ఉష అండ.. మహిళా మెగా జాబ్ మేళాతో 400 మందికి పైగా ఉద్యోగాలు

📰 Generate e-Paper Clip

నిరుద్యోగ యువతకు దాసరి ఉష అండ.. మహిళా మెగా జాబ్ మేళాతో 400 మందికి పైగా ఉద్యోగాలు

ఉద్యోగ కల్పనతో పాటు మహిళల భద్రతకు పెద్దపీట

ఎంపికైన అభ్యర్థులకు డిసెంబర్ 1, 2 తేదీల్లో కంపెనీల సందర్శన

జిల్లా బీసీ జేఏసీ మీడియా ఇన్‌చార్జ్ అబ్దుల్ మాలిక్

ప్రజావాణి జిల్లా ప్రతినిధి
పెద్దపల్లి, నవంబర్ 27

పెద్దపల్లి జిల్లా నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడంతో పాటు మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలనే లక్ష్యంతో ఈ నెల 22న నిర్వహించిన మహిళా మెగా జాబ్ మేళా విజయవంతమైందని జిల్లా బీసీ జేఏసీ మీడియా ఇన్‌చార్జ్ అబ్దుల్ మాలిక్, బీఆర్ఎస్ నాయకుడు పల్లె రాకేష్ తెలిపారు. జిల్లా బీసీ జేఏసీ చైర్‌పర్సన్, బీఆర్ఎస్ యువ నాయకురాలు దాసరి ఉష ఆధ్వర్యంలో సురక్ష మ్యాన్‌పవర్ సర్వీసెస్, ఫిట్ అండ్ ఫ్యూచర్ క్లబ్ సంయుక్త సహకారంతో ఈ మెగా జాబ్ మేళాను నిర్వహించినట్లు వెల్లడించారు.

శుక్రవారం పెద్దపల్లిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ.. ఈ జాబ్ మేళాకు పెద్దపల్లి జిల్లాతో పాటు పరిసర ప్రాంతాల నుంచి 500 మందికి పైగా నిరుద్యోగ యువతీ యువకులు హాజరై ఉద్యోగ అవకాశాల కోసం తమ ప్రతిభను ప్రదర్శించారని తెలిపారు. వివిధ కంపెనీల ప్రతినిధులు నిర్వహించిన ఇంటర్వ్యూలలో దాదాపు 400 మందికి పైగా అభ్యర్థులు ఉద్యోగాలకు ఎంపిక కావడం సంతోషకరమైన విషయమని పేర్కొన్నారు.

నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడమే కాకుండా, ఎంపికైన అభ్యర్థులకు ఆయా కంపెనీల పని విధానం, ఉద్యోగ వాతావరణం, ఇతర సౌకర్యాలపై పూర్తి అవగాహన కల్పించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు తెలిపారు. ఇందులో భాగంగా డిసెంబర్ 1, 2 తేదీల్లో ఎంపికైన అభ్యర్థులను గ్రూపుల వారీగా ఆయా కంపెనీలకు తీసుకెళ్లి ప్రత్యక్షంగా పని పరిస్థితులను పరిచయం చేయనున్నట్లు వెల్లడించారు.

మహిళా ఉద్యోగుల భద్రతకు ప్రత్యేక ప్రాధాన్యత

ఈ మెగా జాబ్ మేళాలో పాల్గొన్న ఐదు కంపెనీలు ఉద్యోగులకు కల్పించే సౌకర్యాల విషయంలో ఇచ్చిన హామీలను తప్పనిసరిగా అమలు చేయాలని వారు కోరారు. ఉద్యోగులకు రెండు పూటలా నాణ్యమైన భోజనం, ఉచిత బస్సు రవాణా సౌకర్యం కల్పించాలని సూచించారు. ముఖ్యంగా మహిళా ఉద్యోగుల భద్రత విషయంలో ఎలాంటి రాజీ పడకుండా కంపెనీల యాజమాన్యాలు పూర్తి బాధ్యత తీసుకోవాలని పేర్కొన్నారు.

మహిళలు ఉద్యోగాల్లో చేరి ఆర్థికంగా ఎదగాలంటే వారికి సురక్షితమైన పని వాతావరణం ఎంతో అవసరమని, ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని జాబ్ మేళాలో పాల్గొన్న కంపెనీలు మహిళా ఉద్యోగుల భద్రతకు భరోసా కల్పించడం అభినందనీయమని అన్నారు.

యువత భవిష్యత్తుకు దాసరి ఉష కృషి అభినందనీయం

గతంలో కూడా టాటా సైన్స్, అజీమ్ ప్రేమ్‌జీ స్కాలర్‌షిప్ వంటి విద్యా, సేవా కార్యక్రమాల ద్వారా పెద్దపల్లి ప్రాంతంలోని విద్యార్థులు, నిరుద్యోగ యువత, మహిళలకు దాసరి ఉష నిరంతరం అండగా నిలుస్తున్నారని వారు కొనియాడారు. కేవలం రాజకీయాలకే పరిమితం కాకుండా ప్రజలకు ఉపయోగపడే సేవా కార్యక్రమాలను చేపడుతూ యువత భవిష్యత్తుకు బాటలు వేస్తున్నారని ప్రశంసించారు.

నిరుద్యోగ సమస్యతో ఇబ్బందులు పడుతున్న యువతకు ఒకే వేదికపై వివిధ కంపెనీల ద్వారా ఉద్యోగ అవకాశాలు కల్పించడం గొప్ప విషయమని, 500 మందికి పైగా హాజరుకాగా 400 మందికి పైగా ఉద్యోగాలకు ఎంపిక కావడం ఈ కార్యక్రమం విజయానికి నిదర్శనమని తెలిపారు.

భవిష్యత్తులో కూడా ఇలాంటి ఉపాధి కార్యక్రమాలను మరిన్ని నిర్వహించి పెద్దపల్లి ప్రాంతంలోని నిరుద్యోగ యువతకు అండగా నిలవాలని ఆకాంక్షించారు. యువత జీవితాల్లో కొత్త వెలుగులు నింపేలా మహిళా మెగా జాబ్ మేళాను విజయవంతంగా నిర్వహించిన దాసరి ఉషకు పెద్దపల్లి ప్రాంత ప్రజల తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.

ఈ మీడియా సమావేశంలో ఫిట్ అండ్ ఫ్యూచర్ క్లబ్ ఉపాధ్యక్షుడు కలువల చరణ్, బీఆర్ఎస్ నాయకులు బీరం రవి, ఎండీ అజీమ్, కన్నం శ్రావణ్ కుమార్, ముఖిద్, సిద్ధు, ఓం ప్రకాష్, వినయ్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.