జనగామ జిల్లా ప్రతినిధి జె.ఉపేందర్, నవంబర్ 26 (ప్రజావాణి):బీఆర్ఎస్ పార్టీ యువజన నాయకులను లక్ష్యంగా చేసుకుని పోలీసులు అక్రమ కేసులు నమోదు చేసి బైండోవర్ చేయడం జనగామ జిల్లాలో కలకలం రేపింది. ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలిపినందుకు ఏకంగా 10 నెలల తర్వాత కేసులు పెట్టడం, నోటీసులు ఇచ్చి తహసీల్దార్ ఎదుట బైండోవర్ చేయడంపై బీఆర్ఎస్ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
గత జనవరిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వైఖరిని నిరసిస్తూ బీఆర్ఎస్ యూత్, బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో జనగామలో నిరసన ప్రదర్శన చేపట్టారు. ఆ కార్యక్రమంలో పాల్గొన్న నాయకులపై పోలీసులు ఇప్పుడు తాజాగా ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
జిల్లా యువజన నాయకుడు ఇరుగు సిద్దులతో పాటు తిప్పారపు విజయ్, పట్టణ యూత్ అధ్యక్షుడు ఉల్లెంగుల సందీప్, బీఆర్ఎస్వీ జిల్లా కో-ఆర్డినేటర్ రావుల తిరుమల్ రెడ్డి, ఇరుగు యాకన్న, కన్నారపు వంశీలకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. గురువారం వారిని జనగామ తహసీల్దార్ ఎదుట హాజరుపరిచి బైండోవర్ చేశారు.
బీఆర్ఎస్ యూత్, బీఆర్ఎస్వీ నాయకులపై పోలీసులు పెట్టిన ఈ అక్రమ కేసులు, బైండోవర్ ను జనగామ ఎమ్మెల్యే, డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. ప్రశ్నించే గొంతులను అణచివేయాలన్న ఉద్దేశంతోనే కాంగ్రెస్ ప్రభుత్వం పోలీసులను ఉసిగొల్పి ఇలాంటి అక్రమ కేసులు పెట్టిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రజా సమస్యలపై పోరాడే యువ నాయకులను బెదిరించి, కేసులతో భయపెట్టాలని చూస్తే బీఆర్ఎస్ శ్రేణులు భయపడబోవని స్పష్టం చేశారు. ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంటుందని, దానిని కాలరాయడం సరికాదన్నారు. అక్రమ కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.
ఈ సందర్భంగా బైండోవర్ అయిన నాయకులకు బీఆర్ఎస్ శ్రేణులు సంఘీభావం తెలిపారు. యువ నాయకులపై కేసులు పెట్టినా ఉద్యమం ఆగదని, ప్రజా సమస్యలపై పోరాటం మరింత ఉధృతంగా కొనసాగుతుందని పేర్కొన్నారు.

