జనగామ ప్రతినిధి జె.ఉపేందర్, నవంబర్ 26 (ప్రజావాణి):కరెన్సీ పై అంబేద్కర్ ఫోటో సాధన సమితి (కాప్స్) ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ 77వ దినోత్సవ వేడుకలను గురువారం జిల్లా కేంద్రం లోని అంబేద్కర్ విగ్రహం వద్ద ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి కరెన్సీ పై అంబేద్కర్ ఫోటో సాధన సమితి జాతీయ అధ్యక్షులు డా. జేరిపోతుల పరశురామ్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత రాజ్యాంగం ప్రతి పౌరుడికి సమానత్వం, స్వేచ్ఛ, సామాజిక న్యాయం, సౌభ్రాతృత్వం వంటి గొప్ప విలువలను అందించిందని అన్నారు. భారత రాజ్యాంగ రూపకర్త డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆచరించాలని పిలుపునిచ్చారు. రాజ్యాంగం కల్పించిన హక్కులతో పాటు పౌరులుగా మన బాధ్యతలను కూడా గుర్తించాలని, రాజ్యాంగ స్ఫూర్తిని భావితరాలకు అందించాలని పేర్కొన్నారు.
అదేవిధంగా భారత కరెన్సీ నోట్లపై డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ చిత్రాన్ని ముద్రించాలనే కాప్స్ ఉద్యమ లక్ష్య సాధన కోసం దేశవ్యాప్తంగా మరింత విస్తృతంగా ఉద్యమాలు చేపడతామని తెలిపారు. డిసెంబర్ 16, 17, 18 తేదీల్లో ఢిల్లీలోని జంతర్ మంతర్ లో కరెన్సీ నోట్లపై అంబేద్కర్ ఫోటో ముద్రించాలని మహాధర్నా నిర్వహిస్తున్నామని, ఆ ధర్నాను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో దళిత బహుజన సంఘాల నాయకులు డా. సిహెచ్. రాజమౌళి, డా. కృష్ణ, కౌన్సిలర్ ఊడుగుల కిష్టయ్య, మాజీ కౌన్సిలర్ రాంచందర్, వంకాడోత్ అనిత, కొయ్యడ మల్లేష్, బోట్ల నర్సింగరావు, నిర్మాల రాములు, పసుల ఏబెల్, రాగల్ల శ్రీహరి, కరెన్సీ పై అంబేద్కర్ ఫోటో సాధన సమితి జాతీయ సలహాదారులు మల్లిగారి రాజు, తిప్పారపు విజయ్, తాళ్లపెళ్లి ఎల్లేష్, తిప్పారపు ప్రసాద్, మిద్దపాక రాజు, మచ్చ కుమార్, చింతల కనకరాజు, దామెర మౌనిక తదితరులు పాల్గొన్నారు.

