*మంథని ఫోటోగ్రాఫర్కు అంతర్జాతీయ గుర్తింపు*
*- మంత్రి శ్రీధర్ బాబు ఘన సన్మానం*
మన ప్రజావాణి. మంతని ప్రతినిధి.
మంథని పట్టణానికి చెందిన ప్రముఖ ఫోటోగ్రాఫర్, రవి వర్మ ఫోటో స్టూడియో యజమాని తూర్పాటి సత్యనారాయణకు అంతర్జాతీయ స్థాయిలో అరుదైన గుర్తింపు లభించింది. ఫ్రాన్స్, ఇటలీ, మొనాకో దేశాల సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రతిష్టాత్మక ఫోటో కాంటెస్ట్ 2026 – “ది మ్యాన్ అండ్ ది సీ” పోటీలో ఆయన తీసిన “బోండా మహిళ తాగుతోంది” అనే ఫోటోకు ప్రత్యేక ప్రస్తావన లభించింది. ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాల నుంచి వేలాది మంది ఫోటోగ్రాఫర్లు పంపిన ఫోటోలలో సత్యనారాయణ ఫోటో అంతర్జాతీయ జ్యూరీని ఆకట్టుకుంది. సముద్రంతో మనిషికి ఉన్న అనుబంధాన్ని, గిరిజన మహిళ జీవన విధానాన్ని ఆయన తన కెమెరాలో అద్భుతంగా బంధించారని నిర్వాహకులు ప్రశంసించారు. ఈ అవార్డు ప్రధానోత్సవం డిసెంబర్ 4, 2026న మొనాకోలోని ప్రపంచ ప్రసిద్ధ ఓషనోగ్రాఫిక్ మ్యూజియంలో జరగనుంది. ఈ సందర్భంగా మంథనిలో ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు సత్యనారాయణను శాలువాతో ఘనంగా సన్మానించారు. మంథని లాంటి చిన్న పట్టణం నుంచి అంతర్జాతీయ స్థాయికి ఎదగడం గర్వకారణమని, ఇది మంథని ప్రాంతానికే గర్వకారణమని మంత్రి అభినందించారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, నాయకులు, ఫోటోగ్రాఫర్లు, పాత్రికేయులు పాల్గొన్నారు.

