📄 ePaper
5pm
7pm
Tuesday, November 24, 2026
📄 ePaper
5pm epaper
7pm epaper
HomeతెలంగాణJangaonగిరిజన విద్యార్థుల అభ్యాస సామర్థ్యాల పెంపునకు క్షేత్రస్థాయి పరిశీలన చేసిన ఐటీడీఏ పిఓ 

గిరిజన విద్యార్థుల అభ్యాస సామర్థ్యాల పెంపునకు క్షేత్రస్థాయి పరిశీలన చేసిన ఐటీడీఏ పిఓ 

📰 Generate e-Paper Clip

జనగామ జిల్లా ప్రతినిధి జె.ఉపేందర్, నవంబర్ 23 (ప్రజావాణి):గిరిజన విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడంతో పాటు, వారిలోని అభ్యాస సామర్థ్యాలను గుర్తించి మెరుగుపరిచేందుకు ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఐటీడీఏ పీఓ లెనిన్ వత్సల్ టోప్పో సూచించారు.

విద్యార్థుల విద్యా ప్రమాణాలను ప్రత్యక్షంగా తెలుసుకునేందుకు ఆయన జనగామ జిల్లాలోని పలు గిరిజన సంక్షేమ విద్యాసంస్థలను సందర్శించి విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించారు.

ఈ పర్యటనలో భాగంగా సోమవారం జనగామ జిల్లాలోని స్టేషన్ ఘన్‌పూర్ బాలికల ఆశ్రమ ఉన్నత పాఠశాల (AHS), స్టేషన్ ఘన్‌పూర్ బాలుర ప్రాథమికోన్నత పాఠశాల (AUPS), నర్మెట్ట బాలికల ఆశ్రమ ఉన్నత పాఠశాల (AHS)లను సందర్శించారు. తరగతి గదుల్లో విద్యార్థుల అభ్యాస విధానాన్ని పరిశీలించి, పాఠ్యాంశాలపై వారి అవగాహన, చదవడం, రాయడం, గణిత నైపుణ్యాలను స్వయంగా తెలుసుకున్నారు. విద్యార్థులతో మాట్లాడి వారి సందేహాలు, అభ్యాస అనుభవాలను అడిగి తెలుసుకున్నారు.

అనంతరం హనుమకొండలోని బలసముద్రంలో నిర్వహిస్తున్న STEAM-60 కార్యక్రమాన్ని సందర్శించి విద్యార్థులతో సంభాషించారు. కార్యక్రమం ద్వారా అందిస్తున్న అభ్యాస అవకాశాలు, విద్యార్థుల భాగస్వామ్యం, వారి ఆసక్తిని పరిశీలించారు. విద్యార్థులు ప్రశ్నించే తత్వాన్ని అలవర్చుకొని, ఆచరణాత్మకంగా నేర్చుకుంటూ తమలోని సృజనాత్మకత, విశ్లేషణాత్మక ఆలోచనా సామర్థ్యాలను పెంపొందించుకోవాలని సూచించారు.

ఈ సందర్భంగా పీఓ మాట్లాడుతూ, విద్యార్థుల అభ్యాస స్థాయిని నిరంతరం అంచనా వేస్తూ, ప్రతి విద్యార్థికి అర్థమయ్యే రీతిలో బోధన అందించాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపై ఉందన్నారు. కేవలం పాఠ్యాంశాల బోధనకే పరిమితం కాకుండా, విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం, ఆలోచనా శక్తి, ప్రాయోగిక పరిజ్ఞానాన్ని పెంపొందించేలా బోధనా విధానాలను మెరుగుపరచాలని సూచించారు.

విద్యాసంస్థల్లో విద్యా ప్రమాణాల పెంపు, విద్యార్థుల సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ కొనసాగిస్తామని పీఓ స్పష్టం చేశారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.