మద్యం సేవించకపోయినా ఫ్యాటీ లివర్ ముప్పు!
గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ లోకిరెడ్డి శ్రీనివాస రెడ్డి
ప్రజావాణి మిర్యాలగూడ నియోజకవర్గం 21
– -రివర్ హాస్పిటల్స్‌లో ఘనంగా గ్యాస్ట్రో & లివర్ ఆరోగ్య శిబిరం
-250 మందికి ఫైబ్రోస్కాన్ పరీక్షలు.. మూడు నెలల తర్వాత మరోసారి ఉచిత వైద్య శిబిరం
మిర్యాలగూడ,
మద్యం సేవించకపోయినా ఫ్యాటీ లివర్ సమస్య బారిన పడే ప్రమాదం ఉందని రివర్ హాస్పిటల్స్ మేనేజింగ్ డైరెక్టర్, ప్రముఖ సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ లోకిరెడ్డి శ్రీనివాస రెడ్డి తెలిపారు. మిర్యాలగూడలోని రివర్ హాస్పిటల్స్ ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన గ్యాస్ట్రో & లివర్ ఆరోగ్య శిబిరానికి ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. ఈ శిబిరంలో సుమారు 250 మందికి ఫ్యాటీ లివర్ స్క్రీనింగ్‌తో పాటు ఫైబ్రోస్కాన్ పరీక్షలు నిర్వహించారు.
ఈ శిబిరంలో వెలుగులోకి వచ్చిన అంశం ఆందోళన కలిగిస్తోంది. మద్యం సేవించని వారిలోనూ ఫ్యాటీ లివర్ సమస్యలు గణనీయంగా కనిపిస్తున్నాయని వైద్యులు గుర్తించారు. అధిక బరువు ఉన్నవారితో పాటు సాధారణ, తక్కువ బరువు కలిగిన వారిలో కూడా ఈ సమస్యను గుర్తించడం గమనార్హం. ముఖ్యంగా పొట్ట చుట్టూ కొవ్వు పేరుకుపోయిన వారు మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
ఈ సందర్భంగా డాక్టర్ శ్రీనివాస రెడ్డి మాట్లాడుతూ.. ఫ్యాటీ లివర్ అనేది కేవలం మద్యపానం చేసేవారికి, అధిక బరువు ఉన్నవారికి మాత్రమే వచ్చే సమస్య కాదని స్పష్టం చేశారు. ప్రారంభ దశలో ఎలాంటి లక్షణాలు కనిపించకపోవచ్చని, నిర్లక్ష్యం చేస్తే కాలేయంలో వాపు, ఫైబ్రోసిస్, సిర్రోసిస్ వంటి ప్రమాదకర సమస్యలకు దారితీస్తుందని హెచ్చరించారు.
ఫ్యాటీ లివర్‌ను నివారించేందుకు ప్రతిరోజూ కనీసం 45 నిమిషాల వ్యాయామం చేయాలని, అన్నం, ఇతర కార్బోహైడ్రేట్ల మోతాదును తగ్గించాలని, చక్కెర పదార్థాలు, స్వీట్లు, కూల్‌డ్రింక్స్‌కు దూరంగా ఉండాలని సూచించారు. జొన్నలు, రాగులు, సజ్జలు వంటి చిరుధాన్యాలతో పాటు ప్రోటీన్లు, కూరగాయలు అధికంగా ఉండే సమతుల్య ఆహారం తీసుకోవాలని తెలిపారు. మద్యపానానికి దూరంగా ఉంటూ, రాత్రిపూట ఆలస్యంగా భోజనం చేయకుండా క్రమబద్ధమైన జీవనశైలిని అలవర్చుకోవాలని సూచించారు.
శిబిరంలో నిర్వహించిన ఫైబ్రోస్కాన్ పరీక్షల ద్వారా కాలేయంలో కొవ్వు నిల్వల స్థాయి, కాలేయ కణజాలం గట్టిపడిన స్థాయిని అంచనా వేశారు. అవసరమైన వారికి వైద్యుల పర్యవేక్షణలో చికిత్స ప్రారంభించారు.
మూడు నెలల తర్వాత మరోసారి ప్రత్యేక శిబిరం
ఈరోజు పరీక్షలు చేయించుకున్న రోగుల్లో చికిత్స అనంతరం వచ్చిన మార్పులను అంచనా వేసేందుకు మూడు నెలల తర్వాత మరోసారి ప్రత్యేక ఆరోగ్య శిబిరం నిర్వహిస్తామని డాక్టర్ శ్రీనివాస రెడ్డి ప్రకటించారు. అవసరమైన వారికి మళ్లీ ఫైబ్రోస్కాన్ పరీక్షలు నిర్వహించి ఆరోగ్య పరిస్థితిని సమీక్షిస్తామని వెల్లడించారు.
మిర్యాలగూడతో పాటు పరిసర ప్రాంతాల ప్రజలు రివర్ హాస్పిటల్స్‌పై చూపిన ఆదరణ, నమ్మకం, విశేష స్పందనకు ఆయన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.

