*విదేశీ వేదికలపై భారత ప్రజాస్వామ్య వ్యవస్థను విమర్శించడం తగదు పాతూరి సుధాకర్ రెడ్డి*
*రాహుల్ గాంధీ వ్యాఖ్యలు దేశ ప్రతిష్ఠను దెబ్బతీసేలా ఉన్నాయి*
*కాంగ్రెస్ రాజకీయ కుట్రలను ప్రజలు గమనిస్తున్నారు పాతూరి సుధాకర్ రెడ్డి”
మేడ్చల్ :- కాంగ్రెస్ అగ్రనేత, లోక్సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ విదేశీ పర్యటనల్లో భారత ప్రజాస్వామ్య వ్యవస్థ, రాజ్యాంగ సంస్థలు, ఎన్నికల సంఘంపై చేస్తున్న వ్యాఖ్యలు దేశ ప్రతిష్ఠను దిగజార్చేలా ఉన్నాయని రాష్ట్ర బీజేపీ నాయకుడు పాతూరి సుధాకర్ రెడ్డి విమర్శించారు. గత ఐదారు సంవత్సరాలుగా రాహుల్ గాంధీ విదేశీ పర్యటనలకు వెళ్లిన ప్రతిసారీ అమెరికా, ఇంగ్లాండ్తో పాటు ఐరోపా దేశాల వేదికలపై భారత ప్రజాస్వామ్యంపై విమర్శలు చేస్తూ, ఇతర దేశాలు భారత ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని కోరడం బాధాకరమని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాన్ని, రాజ్యాంగ సంస్థలను విదేశీ వేదికలపై విమర్శించడం ద్వారా దేశ ప్రజలను అవమానిస్తున్నారని ఆరోపించారు. ఇటీవల హైదరాబాద్లో జరిగిన భారత్ సమ్మిట్లోనూ ఎన్నికల సంఘం, ఓటు చోరీ అంశాలను ప్రస్తావిస్తూ భారత ప్రజాస్వామ్య వ్యవస్థపై అపోహలు సృష్టించే ప్రయత్నం జరిగిందని విమర్శించారు. అమెరికాలో విద్యార్థులతో మాట్లాడుతూ భారత ఎన్నికల సంఘం, ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్తో పాటు రాజ్యాంగబద్ధ సంస్థలపై రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు కూడా ఇదే ధోరణికి నిదర్శనమని అన్నారు. వరుసగా మూడు పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓటమి పాలవడం, గాంధీ కుటుంబ నాయకత్వాన్ని ప్రజలు తిరస్కరించడాన్ని ఆ పార్టీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారని సుధాకర్ రెడ్డి వ్యాఖ్యానించారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం దేశ అభివృద్ధి, భద్రత, ప్రజా సంక్షేమానికి ప్రాధాన్యతనిస్తూ ముందుకు సాగుతోందని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ గత పాలనలో అవినీతి, అక్రమాలు చోటుచేసుకున్నాయని ఆరోపిస్తూ, ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రజల మద్దతుతోనే బీజేపీ అధికారంలోకి వచ్చిందని గుర్తుచేశారు. ప్రజాస్వామ్య పరిరక్షణ పేరుతో విదేశీ వేదికలపై దేశ ప్రతిష్ఠను దెబ్బతీసే వ్యాఖ్యలు చేయడం కాంగ్రెస్ నాయకులు మానుకోవాలని హితవు పలికారు.
ఇకనైనా కాంగ్రెస్ పార్టీ తన రాజకీయ విధానాలను మార్చుకోకపోతే ప్రజలు ఆ పార్టీని కేంద్రంతో పాటు రాష్ట్రాల్లోనూ అధికారానికి దూరంగా ఉంచుతారని పాతూరి సుధాకర్ రెడ్డి హెచ్చరించారు.

