*శంకరంపేట్ మండలానికి 651 కొత్త చేయూత పెన్షన్లు మంజూరు..!*
*శంకరంపేట్ మండల లబ్ధిదారులకు ‘చేయూత’ పెన్షన్ మంజూరి పత్రాల పంపిణీ చేసిన నారాయణఖేడ్ ఎమ్మెల్యే డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి*
*శంకరంపేట్ లో చేయూత పెన్షన్ మంజూరి పత్రాల పంపిణీ..!*
*శంకరంపేట్ మండలానికి 651 కొత్త పెన్షన్లు*
*నారాయణఖేడ్ నియోజకవర్గానికి జిల్లాలోనే అత్యధిక పెన్షన్లు*
*పేదల సంక్షేమమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం – ఎమ్మెల్యే సంజీవరెడ్డి..!*
*ప్రజావాణి న్యూస్, శంకరంపేట ప్రజావాణి ప్రతినిధి బాలరాజు*
శంకరంపేట్ మండల కేంద్రం పరిధిలోని బాయి కాడి పద్మయ్య ఫంక్షన్ హాల్‌లో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో మండలానికి చెందిన లబ్ధిదారులకు నారాయణఖేడ్ శాసనసభ్యులు డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి ‘చేయూత’ పెన్షన్ మంజూరి పత్రాలను అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి మాట్లాడుతూ,
ఒకే రోజు ఐదు మండలాల్లో కార్యక్రమాలు ఉండటం వల్ల ఈ కార్యక్రమానికి రావడానికి కొంత ఆలస్యమైందని, అయినప్పటికీ తన కోసం ఇంత సమయం వేచి ఉన్న ప్రతి ఒక్కరికీ పేరుపేరునా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు.
తెలంగాణ రాష్ట్రంలో సంగారెడ్డి జిల్లాకు అత్యధిక సంఖ్యలో చేయూత పెన్షన్లు మంజూరయ్యాయని, అందులోనూ నారాయణఖేడ్ నియోజకవర్గానికి జిల్లాలోనే అత్యధికంగా పెన్షన్లు రావడం విశేషమని ఆయన పేర్కొన్నారు. పెద్ద శంకరంపేట మండలానికి మొత్తం 651 కొత్త చేయూత పెన్షన్లు మంజూరైనట్లు ఎమ్మెల్యే వెల్లడించారు.
గత ప్రభుత్వ హయాంలో పెన్షన్ల కోసం సుదీర్ఘకాలం ఎదురుచూసిన అనేక కుటుంబాలు, ముఖ్యంగా దివ్యాంగులు మరియు ఆర్థికంగా వెనుకబడిన వర్గాల ఆకాంక్షలను ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేరుస్తోందని ఎమ్మెల్యే తెలిపారు. గత పదేళ్ల పాలనలో రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారే తప్ప పేద ప్రజలకు ఆశించిన స్థాయిలో న్యాయం జరగలేదని ఆయన విమర్శించారు.
ప్రస్తుత ప్రజా ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారెంటీలతో పాటు ప్రజల అవసరాలను గుర్తించి అనేక సంక్షేమ పథకాలను పారదర్శకంగా అమలు చేస్తోందని ఎమ్మెల్యే వివరించారు.
ముఖ్యంగా మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం, రూ. 500లకే వంట గ్యాస్ సిలిండర్ అందిస్తున్నామని తెలిపారు. అలాగే గృహజ్యోతి ద్వారా పేదలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, ఇందిరమ్మ ఇండ్ల ద్వారా సొంత ఇంటి కల నెరవేర్చడం, రైతు భరోసా కింద రైతులకు పెట్టుబడి సాయం మరియు రూ. 2 లక్షల వరకు రైతు రుణమాఫీ చేసి అన్నదాతలకు అండగా నిలుస్తున్నామని చెప్పారు. వీటితో పాటు రాజీవ్ ఆరోగ్యశ్రీ పరిమితిని రూ. 10 లక్షలకు పెంచడం, సన్న వడ్లకు క్వింటాలుకు రూ. 500 బోనస్ ఇవ్వడం, నిరుద్యోగ యువతకు ప్రభుత్వ ఉద్యోగ నియామక పత్రాలు అందించడం ద్వారా అన్ని వర్గాల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు.
ఇంకా ఎవరైనా అర్హులు మిగిలి ఉంటే వారిని గుర్తించి, ప్రభుత్వం అందిస్తున్న ప్రతి సంక్షేమ పథకం వారికి చేరేలా అధికారులు, పంచాయతీ కార్యదర్శులు మరియు ప్రజాప్రతినిధులు నిరంతరం సమన్వయంతో పనిచేయాలని ఆయన సూచించారు.
ఈ కార్యక్రమంలో మండల సర్పంచులు, స్థానిక ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, వివిధ శాఖల అధికారులు మరియు పెద్ద సంఖ్యలో పెన్షన్ లబ్ధిదారులు పాల్గొన్నారు.

