*చెన్నూర్ నియోజకవర్గ సర్వతోముఖాభివృద్ధికి కృషి*
*నియోజకవర్గ అభివృద్ధికి 800 కోట్లతో వివిధ పనులు*
*రాష్ట్ర కార్మిక, ఉపాధి శిక్షణ, కర్మాగార, గనులు భూగర్భ శాఖ మంత్రి గడ్డం వివేకానంద*
* *మన ప్రజావాణి మంచిర్యాల జిల్లా ప్రతినిధి:-*
చెన్నూర్ నియోజకవర్గ ప్రజల సంక్షేమం, అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తుందని రాష్ట్ర కార్మిక, ఉపాధి శిక్షణ, కర్మాగార, గనులు భూగర్భ శాఖ మంత్రి గడ్డం వివేకానంద తెలిపారు. మంగళవారం జిల్లాలోని చెన్నూర్ పట్టణంలో గల బాలాజీ గార్డెన్స్‌లో కోటపల్లి, చెన్నూర్ మండలాలు, చెన్నూర్ మున్సిపాలిటీ పరిధిలో నూతనంగా మంజూరైన ఆసరా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి కిషన్, మున్సిపల్ కమిషనర్ మారుతి ప్రసాద్, చైర్ పర్సన్ పెద్దింటి పద్మ, చెన్నూర్, కోటపల్లి మండలాల మండల పరిషత్ అభివృద్ధి అధికారులు అజ్మత్ అలీ, నాగేశ్వర రెడ్డి, చెన్నూర్ డిటి సనత్, అధికారులతో కలిసి లబ్ధిదారులకు మంజూరు పత్రాలను అందజేశారు.ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి వివేక్ మాట్లాడుతూ, చెన్నూర్ నియోజకవర్గాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేయడమే లక్ష్యంగా కృషి చేస్తున్నామని, కొత్త పింఛన్ల మంజూరు ప్రక్రియ చేపట్టి, నేడు చెన్నూర్ అర్బన్ పరిధిలో 509 మంది, చెన్నూర్ మున్సిపాలిటీ పరిధిలో 257 మంది, కోటపల్లి మండల పరిధిలో 457 మంది కలిపి మొత్తం 1 వేయి 223 మంది లబ్ధిదారులకు చేయూత పింఛన్లు మంజూరు చేసి, పేదలకు పింఛన్ల ద్వారా ఆర్థిక భరోసా కల్పించడం జరుగుతుందని తెలిపారు. అర్హులైన లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇంటి నిర్మాణం కోసం 5 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందిస్తున్నామని, ఇండ్ల నిర్మాణంలో ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనలు, మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు. కోటపల్లి మండలంలో పలువురు లబ్ధిదారులు ఇళ్ల నిర్మాణం చేపట్టలేని పరిస్థితి ఉందని, నిజమైన నిరుపేదలకు ఇండ్ల నిర్మాణంలో సహకారం అందించేలా అధికారులు, కాంట్రాక్టర్ల సహకారంతో ఇండ్ల నిర్మాణం చేపట్టాలని తెలిపారు. నియోజకవర్గంలోని కొండ పోశమ్మ ఆలయానికి వివిధ గ్రామాల నుంచి భక్తులు, కుటుంబ సమేతంగా పెద్ద సంఖ్యలో వస్తుంటారని, వారి సౌకర్యార్థం ఆలయ పరిసరాలలో 2 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేపడుతున్నామని తెలిపారు. మహిళలు, భక్తుల కోసం మరుగుదొడ్లు, మూత్రశాలలు, వంట చేసుకునేందుకు అవసరమైన సదుపాయాలు కల్పిస్తామని, 3, 4 నెలలలో పనులు పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. చెన్నూర్ లోని శివాలయ అభివృద్ధికి 17 కోట్ల రూపాయలు మంజూరయ్యాయని, సంబంధిత పనులు త్వరలో వేగవంతం కానున్నాయని తెలిపారు. కొండపోశమ్మ ఆలయం, శివాలయం, జైపూర్ క్రొకడైల్ పార్క్ ప్రాంతాలను అనుసంధానం చేస్తూ చెన్నూర్ ను మంచి పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసే లక్ష్యంతో పని చేస్తున్నామని తెలిపారు.నియోజకవర్గంలోని గ్రామాలు, పట్టణాల్లో సీసీ రోడ్లు, డ్రైనేజీలు, ఇతర మౌలిక వసతుల కల్పనకు పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తున్నామని తెలిపారు. గోదావరి పుష్కరాల అభివృద్ధికి రూ.70 కోట్లు మంజూరయ్యాయని, హామ్ రోడ్లకు పంచాయతీరాజ్ శాఖ ద్వారా రూ.83 కోట్లు, రోడ్లు భవనాల శాఖ ద్వారా రూ.63 కోట్లు మంజూరయ్యాయని వివరించారు. చెన్నూర్ పట్టణంలో అమృత్ పథకం క్రింద ఇంటింటికీ త్రాగునీటి సరఫరా పనులకు 30 కోట్ల రూపాయలు, క్యాతనపల్లిలో 40 కోట్ల రూపాయలు, మందమర్రిలో 30 కోట్ల రూపాయలతో పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. జోడువాగు రహదారి అభివృద్ధికి 100 కోట్ల రూపాయలతో కొత్త రహదారి మంజూరైందని, టెండర్ ప్రక్రియ పూర్తయిన వెంటనే పనులు ప్రారంభిస్తామని తెలిపారు. గతంలో ప్రమాదాలకు కారణమవుతున్న రహదారిపై మరమ్మతుల కోసం 2 కోట్ల రూపాయలు కేటాయించి పనులు చేపట్టామని తెలిపారు. చెన్నూర్ పట్టణంలో రహదారి విస్తరణకు వ్యాపారులు స్వచ్ఛందంగా సహకరించి స్థలాలు వదులుకోవడం అభినందనీయమని, వారి సహకారంతో చేపట్టిన రోడ్డు పనులను 2 నెలలలో పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. కోటపల్లి నుంచి చెన్నూర్, మంచిర్యాల వైపు వెళ్లే ప్రజలకు సౌకర్యంగా 1.60 కోట్ల రూపాయలతో రహదారి పనులు పూర్తి చేశామని తెలిపారు. చెన్నూర్ ప్రాంతంలో పారిశ్రామిక అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని, గతంలో కాకా వెంకటస్వామి, జి వినోద్ కుమార్ ల కృషితో 850 మెగావాట్ల విద్యుత్ ప్లాంట్ ఏర్పాటైందని, ప్రస్తుతం అదనంగా 1 వేయి 250 మెగావాట్ల విద్యుత్ ప్లాంట్ పనులు ప్రారంభమయ్యాయని, వచ్చే ఏడాదిలో పూర్తి చేయాలని లక్ష్యంతో పనిచేస్తున్నామని తెలిపారు. రామకృష్ణాపూర్ ఓపెన్‌కాస్ట్ పరిధిలో కొత్త బొగ్గు గనిని మంజూరు చేయించామని, అటవీ అనుమతులు పూర్తయిన అనంతరం 6 నెలలలో గని ప్రారంభించే దిశగా చర్యలు తీసుకుంటామని, తద్వారా స్థానిక యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని తెలిపారు. యువతకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంలో శిక్షణ అందించేందుకు అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ మంజూరు చేయించామని, అవసరమైన అదనపు ఒక ఎకరం స్థలాన్ని కేటాయిస్తే పనులు ప్రారంభిస్తామని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలలో మౌలిక వసతుల మెరుగుదలకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని, చెన్నూర్ డిగ్రీ కళాశాలలో 2 కోట్ల రూపాయలతో, ఇంటర్మీడియట్ కళాశాలలో 1.40 కోట్ల రూపాయలతో మరమ్మతులు, అభివృద్ధి పనులు చేపట్టడం జరిగిందని తెలిపారు. చెన్నూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో డయాలసిస్ యూనిట్ 3 బదిలీలలో పని చేస్తుందని, గతంలో డయాలసిస్ కోసం మంచిర్యాలకు వెళ్లవలసి వచ్చేదని, ప్రస్తుతం స్థానికంగానే సేవలు అందుతున్నాయని తెలిపారు. కొత్త ఆసుపత్రిలో కార్డియాలజీ యూనిట్, అత్యవసర వైద్య విభాగం ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటామని, 100 పడకల ఆసుపత్రిలో 20 మంది వైద్యులతో వైద్య సేవలు అందుబాటులోకి వచ్చాయని తెలిపారు. సోమన్‌పల్లిలో సుమారు 200 కోట్ల రూపాయలతో 2 వేల 500 మంది విద్యార్థులకు నాణ్యమైన విద్య, వసతి, క్రీడలు, ఇతర సదుపాయాలతో సమీకృత పాఠశాలను నిర్మిస్తున్నామని, వచ్చే విద్యా సంవత్సరం నుంచి అందుబాటులోకి తీసుకురావడానికి కృషి చేస్తున్నామని తెలిపారు. చెన్నూర్ ప్రాంత ప్రజల రవాణా సౌకర్యం కోసం వచ్చే వారంలో చెన్నూరులో ఆర్టిసి బస్ డిపో ఏర్పాటు చేయడం జరుగుతుంది, డిపో ద్వారా సుమారు 68 బస్సులు అందుబాటులోకి వస్తాయని, మారుమూల గ్రామాలకు కూడా బస్సు సౌకర్యం కల్పిస్తామని తెలిపారు. కాళేశ్వరం, దుగ్నేపల్లి, కర్రగుట్టపల్లి తదితర ప్రాంతాలకు ప్రజల అవసరాలకు అనుగుణంగా బస్సులు నడిపేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. నియోజకవర్గంలో ప్రస్తుతం సుమారు 800 కోట్ల రూపాయలతో వివిధ అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని, ప్రతి గ్రామంలో అభివృద్ధి పనులకు ప్రాధాన్యత ఇస్తున్నామని, ఒక్కో గ్రామానికి 20 లక్షల రూపాయల నుండి 30 లక్షల రూపాయల వరకు పనులు మంజూరు చేయడం జరిగిందని తెలిపారు. రాబోయే 2 సంవత్సరాలలో ప్రతి గ్రామానికి అదనంగా 20 లక్షల నుంచి 25 లక్షల రూపాయల వరకు అభివృద్ధి పనులు మంజూరు చేసేలా కృషి చేస్తానని తెలిపారు. రాష్ట్రంలో సన్నబియ్యం పథకం, ఇందిరమ్మ ఇళ్లు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, విద్యార్థులకు అల్పాహార పథకం వంటి అనేక సంక్షేమ కార్యక్రమాలను ప్రభుత్వం అమలు చేస్తుందని తెలిపారు. త్వరలో ప్రతి కుటుంబానికి 5 లక్షల రూపాయల ప్రమాద బీమా కల్పించే ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రారంభించనున్నారని, మహిళలకు ఇందిరమ్మ చీరల పంపిణీ కూడా చేపట్టనున్నారని తెలిపారు.అనంతరం 78 మంది కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్ లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు. చెన్నూర్ పట్టణంలో 3 కోట్ల 30 లక్షల రూపాయల వ్యయంతో ఏర్పాటు చేసిన వెనుకబడిన తరగతుల బాలికల సంక్షేమ వసతి గృహాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి వివేక్ మాట్లాడుతూ,
సుమారు 3.30 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన ఈ వసతి గృహంలో 120 మంది విద్యార్థినులకు వసతి కల్పించేలా అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. బిసి ల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి పని చేస్తుందని తెలిపారు పట్టణాలు, గ్రామాలలో సిసి రోడ్లు, సైడ్ డ్రైనేజీల నిర్మాణానికి ప్రాధాన్యత ఇస్తున్నామని, వర్షాకాలంలో మురుగునీటి సమస్యలతో ప్రజలు ఇబ్బందులు పడకుండా చర్యలు చేపట్టడం జరుగుతుందని తెలిపారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ బిసి, ఎస్సి, ఎస్టి వసతి గృహాలు, ఆశ్రమ పాఠశాలలలో మెరుగైన వసతులు కల్పించాలని, మారుమూల ప్రాంతాలలోని విద్యార్థులకు సైతం నాణ్యమైన విద్య, మెరుగైన వసతి అందించేందుకు డిఎంఎఫ్టి, సిఎస్ఆర్ నిధులను వినియోగిస్తామని తెలిపారు. విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకొని ఉన్నత లక్ష్యాలను సాధించి, మంచి ఉద్యోగ అవకాశాలు పొందేలా ప్రభుత్వం అవసరమైన అన్ని సదుపాయాలు కల్పిస్తుందని తెలిపారు. ముదిరాజ్ కమ్యూనిటీ భవనానికి 50 లక్షల రూపాయలు, మున్నూరు కాపు సంఘానికి 2 విడతలలో 30 లక్షల రూపాయలు, 20 లక్షల రూపాయలు, పద్మశాలి సంఘానికి 15 లక్షల రూపాయలు, విశ్వబ్రాహ్మణ సంఘానికి 30 లక్షల రూపాయలు, గౌడ సంఘానికి 30 లక్షల రూపాయలు, మైనారిటీలకు 50 లక్షల రూపాయలు కేటాయించడం జరిగిందని, యాదవ సంఘ భవన నిర్మాణానికి 30 లక్షల రూపాయలు మంజూరు చేయడం జరుగుతుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు, ప్రజా ప్రతినిధులు, లబ్ధిదారుల పాల్గొన్నారు.


