*ప్రతి ఇంటికి ఇందిరమ్మ జీవిత బీమా పథకం*
*ఈ నెల 19 నుంచి రాష్ట్రవ్యాప్తంగా అమలు*
*18 నుంచి 59 ఏళ్ల మధ్య వయస్సున్న కుటుంబ యజమానికి రూ.5 లక్షల బీమా :- పట్నం మహేందర్ రెడ్డి*
మేడ్చల్: రాష్ట్రంలోని ప్రతి నిరుపేద కుటుంబానికి ఆర్థిక భరోసా కల్పించడంతో పాటు ఆపద సమయంలో అండగా నిలిచేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని ప్రవేశపెడుతోందని శాసనమండలి ప్రభుత్వ చీఫ్ విప్ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి తెలిపారు. ఈ నెల 19వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఈ పథకం అమలులోకి రానుందని వెల్లడించారు. మేడ్చల్ నియోజకవర్గంలో తన రెండో రోజు పర్యటనలో భాగంగా ఆయన పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ముందుగా అత్వెల్లీ లోని జీఎన్ఆర్ కన్వెన్షన్లో నిర్వహించిన కార్యక్రమంలో కొత్తగా మంజూరైన చేయూత ఆసరా పెన్షన్ల ధ్రువీకరణ పత్రాలను లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా లబ్ధిదారులతో మాట్లాడి పెన్షన్ల ద్వారా కలిగే ప్రయోజనాలను వివరించారు. అర్హులైన పేదలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని పేర్కొన్నారు.
*ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల జీవిత బీమా*
ఈ సందర్భంగా పట్నం మహేందర్ రెడ్డి మాట్లాడుతూ.. కుటుంబ పెద్దను కోల్పోయినప్పుడు ఆ కుటుంబం ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కోకుండా ఆదుకోవాలనే ఉద్దేశంతో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని అమలు చేస్తున్నట్లు తెలిపారు. 18 నుంచి 59 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన కుటుంబ యజమానికి రూ.5 లక్షల జీవిత బీమా సౌకర్యం కల్పించనున్నట్లు వివరించారు. ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని పేద కుటుంబాలకు ఆర్థిక భద్రత కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు.
*రాష్ట్రవ్యాప్తంగా 4.63 లక్షల మందికి చేయూత పెన్షన్లు*
రాష్ట్రంలో కొత్తగా 4 లక్షల 63 వేల మందికి చేయూత ఆసరా పెన్షన్లు మంజూరు చేసినట్లు మహేందర్ రెడ్డి వెల్లడించారు. ఇందుకోసం ప్రభుత్వం ప్రతి నెలా రూ.114 కోట్ల నిధులను ఖర్చు చేయనుందని తెలిపారు. మేడ్చల్ జిల్లాలో కొత్తగా 25,553 చేయూత పెన్షన్లు మంజూరైనట్లు తెలిపారు. నియోజకవర్గాల వారీగా వివరాలను వెల్లడిస్తూ మేడ్చల్లో 6,681 మందికి, ఉప్పల్లో 4,278 మందికి, మల్కాజిగిరిలో 2,705 మందికి, కుత్బుల్లాపూర్లో 6,685 మందికి, కూకట్పల్లిలో 5,203 మందికి చేయూత పెన్షన్లు మంజూరైనట్లు వివరించారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు.
*నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్లు.. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం*
రాష్ట్రంలోని నిరుపేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లను అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించడం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా గౌరవంగా ప్రయాణించే అవకాశం కల్పించిందన్నారు. కొత్త రేషన్ కార్డుల మంజూరు, రూ.500కే వంట గ్యాస్ వంటి సంక్షేమ పథకాలను అర్హులైన పేదలకు అందిస్తున్నట్లు చెప్పారు. రాష్ట్రంలోని ప్రతి నిరుపేద కుటుంబ సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు.
*రూ.10 కోట్లతో మురుగు, వర్షపు నీటి కాల్వల నిర్మాణాలు*
మేడ్చల్ నియోజకవర్గ పర్యటనలో భాగంగా తుమ్ముకుంటలోని ఇందిరమ్మ ఇళ్ల పరిసర ప్రాంతాల్లో రూ.5 కోట్ల నిధులతో వ్యర్థ జలాలు, వర్షపు నీరు సాఫీగా వెళ్లేందుకు నిర్మించనున్న కాల్వల పనులకు పట్నం మహేందర్ రెడ్డి శంకుస్థాపన చేశారు. అలాగే కీసర సర్కిల్ పరిధిలోని దమ్మాయిగూడ ఆర్జీకే కాలనీలో మరో రూ.5 కోట్ల నిధులతో చేపట్టనున్న మురుగునీటి, వర్షపు నీటి ప్రవాహ కాల్వల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పట్టణాలు, కాలనీల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. మురుగునీటి సమస్యలు, వర్షాకాలంలో నీరు నిలిచిపోవడం వంటి ఇబ్బందులను పరిష్కరించేందుకు కాల్వల నిర్మాణాలు చేపడుతున్నట్లు తెలిపారు. అభివృద్ధి పనులను నాణ్యతా ప్రమాణాలతో వేగంగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు.
*పేదల సంక్షేమం ప్రభుత్వాల బాధ్యత: ఎంపీ ఈటల రాజేందర్*
ఈ కార్యక్రమంలో పాల్గొన్న మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. ప్రభుత్వం ఏదైనా ప్రజల సంక్షేమం, ముఖ్యంగా పేదల అభ్యున్నతి కోసం కృషి చేయాలని అన్నారు. రాజకీయాల్లో పదవులు శాశ్వతం కావని, ప్రజలకు చేసే సేవలు, సంక్షేమ కార్యక్రమాలే శాశ్వతంగా గుర్తుండిపోతాయని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అయినా, కేంద్ర ప్రభుత్వం అయినా పేదల కోసం పనిచేయాలని సూచించారు. ఇంకా పెన్షన్లు అందని అర్హులైన వారందరికీ పెన్షన్లు మంజూరు చేయాలని కోరారు.
*పెన్షన్ రూ.4 వేలకు పెంచాలి: ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి*
మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి మాట్లాడుతూ.. గతంలో ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు ఆసరా పెన్షన్ను రూ.2 వేల నుంచి రూ.4 వేలకు పెంచి అందించాలని డిమాండ్ చేశారు. వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, పేద కుటుంబాలకు పెన్షన్లు ఎంతో ఆసరాగా ఉంటాయని తెలిపారు. అభివృద్ధి కార్యక్రమాల అమలులో ప్రతిపక్ష పార్టీల ప్రజాప్రతినిధులను కూడా భాగస్వాములను చేసుకుంటూ ముందుకు వెళ్లాలని సూచించారు.
*అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందేలా చర్యలు: కలెక్టర్ మనూ చౌదరి*
జిల్లా కలెక్టర్ మనూ చౌదరి మాట్లాడుతూ.. జిల్లాలో అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ పథకాలు అందేలా జిల్లా యంత్రాంగం కృషి చేస్తోందని తెలిపారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలులో అధికారులు సమన్వయంతో పనిచేస్తూ అర్హులైన లబ్ధిదారులను గుర్తించాలని పేర్కొన్నారు.
*సమన్వయంతోనే ప్రభుత్వ పథకాల విజయవంతమైన అమలు: వజ్రేష్ యాదవ్*
మేడ్చల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి వజ్రేష్ యాదవ్ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోందని తెలిపారు. ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేసినప్పుడే ప్రభుత్వ పథకాలు అర్హులైన ప్రజలకు పూర్తిస్థాయిలో చేరుతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ నరసింహ యాదవ్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు నక్క ప్రభాకర్ గౌడ్, వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు, కొత్తగా పెన్షన్లు మంజూరైన లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.

