📄 ePaper
5pm
7pm
Tuesday, November 17, 2026
📄 ePaper
5pm epaper
7pm epaper
Homeతెలంగాణమధ్యాహ్న భోజన కార్మికుల శ్రమకు తగిన గుర్తింపు ఏదీ?

మధ్యాహ్న భోజన కార్మికుల శ్రమకు తగిన గుర్తింపు ఏదీ?

📰 Generate e-Paper Clip

మధ్యాహ్న భోజన కార్మికుల శ్రమకు తగిన గుర్తింపు ఏదీ?

నవంబర్ 21న కలెక్టరేట్ ముట్టడి.. 14 మండలాల కార్మికులు తరలిరావాలి

కనీస వేతనం అమలు చేయకుంటే మరో సమ్మె తప్పదు

ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి పూసాల రమేష్ హెచ్చరిక

ప్రజావాణి జిల్లా ప్రతినిధి
పెద్దపల్లి నవంబర్ 17

పెద్దపల్లి: మధ్యాహ్న భోజన పథకంలో పనిచేస్తున్న కార్మికులపై రోజురోజుకూ పనిభారం పెంచుతూ, వేతనాలు మాత్రం పెంచకపోవడం అన్యాయమని ఏఐటీయూసీ తెలంగాణ మధ్యాహ్న భోజన పథకం వర్కర్స్ యూనియన్ పెద్దపల్లి జిల్లా ప్రధాన కార్యదర్శి పూసాల రమేష్ ఆవేదన వ్యక్తం చేశారు. కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 21వ తేదీ శనివారం పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు. జిల్లాలోని 14 మండలాలకు చెందిన మధ్యాహ్న భోజన కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

ఈ సందర్భంగా పూసాల రమేష్ మాట్లాడుతూ.. గత 24 సంవత్సరాలుగా మధ్యాహ్న భోజన కార్మికులతో ప్రభుత్వం వివిధ రకాల పనులు చేయించుకుంటున్నప్పటికీ, వారి వేతనాలను మాత్రం పెంచడం లేదని విమర్శించారు. ప్రారంభంలో కేవలం మధ్యాహ్న భోజనం వండే బాధ్యత మాత్రమే ఉండేదని, ప్రస్తుతం ఉదయం అల్పాహారం, రాగిజావ, పాలు, కోడిగుడ్లు పంపిణీ వంటి అదనపు బాధ్యతలను కూడా కార్మికులపైనే మోపుతున్నారని తెలిపారు.

ప్రభుత్వం ప్రారంభంలో వారానికి ఒక కోడిగుడ్డు అందించాలని నిర్ణయించి, దానిని ఉడకబెట్టేందుకు ఒక్కో గుడ్డుకు 25 పైసలు చెల్లించేదని గుర్తుచేశారు. ప్రస్తుతం వారానికి మూడు కోడిగుడ్లు అందించాలని నిర్ణయించినప్పటికీ, వాటిని ఉడకబెట్టేందుకు ఎలాంటి అదనపు చార్జీలు చెల్లించడం లేదన్నారు. మార్కెట్ ధరతో పోలిస్తే ప్రభుత్వం కోడిగుడ్లకు తక్కువ మొత్తమే చెల్లిస్తోందని పేర్కొన్నారు.

అదేవిధంగా సత్యసాయి ట్రస్ట్ ద్వారా అందిస్తున్న రాగిపిండితో జావ తయారుచేసి విద్యార్థులకు వడ్డించే బాధ్యతను కూడా మధ్యాహ్న భోజన కార్మికులకే అప్పగించారని తెలిపారు. ఒక్కో విద్యార్థికి కేవలం 25 పైసలు మాత్రమే చెల్లిస్తుండటంతో గ్యాస్ ఖర్చులు కూడా రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభించిన అల్పాహార పథకాన్ని కూడా మధ్యాహ్న భోజన కార్మికులే నిర్వహించాలని విద్యాశాఖ అధికారులు ఆదేశాలు జారీ చేశారని తెలిపారు. ఉదయం 7 గంటలకే పాఠశాలకు చేరుకొని అల్పాహారం వడ్డించడం, అనంతరం రాగిజావ, పాలు, కోడిగుడ్లు అందించడం, మధ్యాహ్నం భోజనం తయారుచేసి విద్యార్థులకు వడ్డించడం వరకు అన్ని పనులను కార్మికులే చేస్తున్నారని వివరించారు.

ఇంతటి పనిభారం మోస్తున్న కార్మికులకు నెలకు కేవలం రూ.3 వేల గౌరవ వేతనం మాత్రమే చెల్లించడం బాధాకరమన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. కార్మికులను స్కిల్డ్ వర్కర్లుగా గుర్తించి, వారి శ్రమకు తగిన వేతనాలు చెల్లించాలని కోరారు. హైకోర్టు ఉత్తర్వుల ప్రకారం కనీస వేతనం రూ.17 వేలు అమలు చేయాలని డిమాండ్ చేశారు.
కార్మికుల ప్రధాన డిమాండ్లు:
హైకోర్టు ఉత్తర్వుల ప్రకారం మధ్యాహ్న భోజన కార్మికులకు నెలకు కనీస వేతనం రూ.17 వేలు చెల్లించాలి.మధ్యాహ్న భోజన నిర్వహణకు అవసరమైన నిత్యావసర సరుకులు, గ్యాస్, కోడిగుడ్లతో సహా అన్ని వస్తువులను ప్రభుత్వమే సరఫరా చేయాలి.
హరే రామ హరే కృష్ణ ట్రస్ట్ ద్వారా అందిస్తున్న అల్పాహార పథకం నిర్వహణకు అదనంగా నెలకు రూ.3 వేల వేతనం చెల్లించాలి.

కార్మికుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని, లేనిపక్షంలో మరోసారి రాష్ట్రవ్యాప్త సమ్మెకు సిద్ధమవుతామని పూసాల రమేష్ హెచ్చరించారు. అంతేకాకుండా పెద్దపల్లి జిల్లా మంథని మండలం గంగాపురి వద్ద ఉన్న సెంట్రలైజ్డ్ కిచెన్‌ను కూడా ముట్టడిస్తామని స్పష్టం చేశారు. కార్మికుల హక్కుల సాధన కోసం నిర్వహించే కలెక్టరేట్ ముట్టడిలో 14 మండలాల కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.