జర్నలిస్టులకు జాతీయ పత్రికా దినోత్సవం శుభాకాంక్షలు తెలిపిన సీజీఆర్
ప్రజాస్వామ్య పరిరక్షణలో పత్రికా రంగం కీలక పాత్ర
నిజాలను నిర్భయంగా వెలుగులోకి తీసుకురావడంలో జర్నలిస్టుల సేవలు అభినందనీయం: చిమ్ముల గోవర్ధన్ రెడ్డి
గుమ్మడిదల, నవంబర్ 16 (ప్రజావాణి): జాతీయ పత్రికా దినోత్సవాన్ని పురస్కరించుకుని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు, సీజీఆర్ ట్రస్ట్ చైర్మన్ చిమ్ముల గోవర్ధన్ రెడ్డి పాత్రికేయ సోదర, సోదరీమణులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో పత్రికా రంగం నాలుగో స్తంభంగా కీలక పాత్ర పోషిస్తోందని పేర్కొన్నారు.ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకురావడంతో పాటు ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిగా జర్నలిస్టులు పనిచేస్తున్నారని కొనియాడారు. నిజాలను నిర్భయంగా వెల్లడిస్తూ, అవినీతి, అక్రమాలను ప్రశ్నిస్తూ సామాన్య ప్రజల గొంతుకగా నిలుస్తున్న పాత్రికేయుల సేవలు ఎంతో విలువైనవని అన్నారు.అనేక సవాళ్లు, ఒత్తిళ్లను ఎదుర్కొంటూ సమాజ శ్రేయస్సు కోసం నిరంతరం శ్రమిస్తున్న జర్నలిస్టుల కృషి అభినందనీయమని పేర్కొన్నారు. ప్రజాస్వామ్య విలువల పరిరక్షణతో పాటు సామాజిక చైతన్యం, సమాజ అభివృద్ధిలో పత్రికా రంగం మరింత కీలక పాత్ర పోషించాలని ఆకాంక్షించారు. ప్రజా సమస్యల పరిష్కారానికి జర్నలిస్టులు ఇదే స్ఫూర్తితో ముందుకు సాగాలని కోరుతూ జాతీయ పత్రికా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

