కార్తీక తొలి సోమవారం.. బీరంగూడ ఆలయానికి పోటెత్తిన భక్తులు
హరహర మహాదేవ నామస్మరణతో మార్మోగిన బీరంగూడ గుట్ట ప్రాంగణం
భ్రమరాంబిక మల్లికార్జున స్వామి ఆలయంలో విశేష పూజలు, అభిషేకాలు
అమీన్పూర్, నవంబర్ 16 (ప్రజావాణి): కార్తీక మాసం తొలి సోమవారం సందర్భంగా అమీన్పూర్ డివిజన్ పరిధిలోని బీరంగూడ గుట్టపై వెలసిన శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. కార్తీక మాసం, సప్తమి తిథి, శ్రవణ నక్షత్రం, సోమవారం కలిసి రావడంతో ఆలయానికి విశేష ప్రాధాన్యత ఏర్పడింది. తెల్లవారుజాము నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు.తెల్లవారుజామున మూడు గంటల నుంచే భక్తుల రాక ప్రారంభమైంది. స్వామివారి దర్శనం కోసం భక్తులు బారులు తీరారు. ఆలయ అర్చకులు వేదమంత్రోచ్ఛారణల నడుమ స్వామివారికి పంచామృతాభిషేకాలు, విశేష పూజలు నిర్వహించారు. మంగళవాయిద్యాలు, హరహర మహాదేవ శంభో శంకర నామస్మరణతో బీరంగూడ గుట్ట మార్మోగింది.
కార్తీక మాస సంప్రదాయంలో భాగంగా భక్తులు ఉసిరికాయలతో నెయ్యి దీపాలు వెలిగించి మొక్కులు చెల్లించుకున్నారు. దీపాల వెలుగులు, శివనామస్మరణతో ఆలయ పరిసరాలు ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి.
భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ఆలయ కమిటీ ముందస్తు ఏర్పాట్లు చేపట్టింది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా బారికేడ్లు ఏర్పాటు చేసి, దర్శన ఏర్పాట్లను పర్యవేక్షించారు. కార్తీక మాస తొలి సోమవారం సందర్భంగా భక్తులు కుటుంబ సమేతంగా ఆలయానికి చేరుకుని స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.


