పట్టభద్రుల సమస్యలపై జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్
విద్యాసంస్థలు, గ్రంథాలయాలను సందర్శించి నిరుద్యోగ యువత, పట్టభద్రుల సమస్యలపై ఆరా
కూసుమంచి, నవంబర్ 17 (ప్రజావాణి):
ఖమ్మం–నల్గొండ–వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా జనసేన పార్టీ అభ్యర్థి డాక్టర్ గడల శ్రీనివాసరావుకు మద్దతుగా చేపట్టిన ‘గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ ప్రచార వాహనం మంగళవారం పాలేరు నియోజకవర్గంలో పర్యటించింది.
ఈ సందర్భంగా కూసుమంచిలోని ప్రసిద్ధ కాకతీయ గణపేశ్వర శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం కూసుమంచి మండలంలోని కూసుమంచి, పాలేరు, నాయకన్‌గూడెం, జుజ్జులరావుపేట, గురవాయిగూడెం, గంగాబండతండా, గట్టుసింగారం, మల్లేపల్లి గ్రామాల్లో పర్యటించి వివిధ విద్యాసంస్థలు, గ్రంథాలయాలను సందర్శించారు.
ఈ సందర్భంగా నిరుద్యోగ యువత, ఉద్యోగార్థులు, పట్టభద్రులతో నేరుగా మాట్లాడి వారు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకున్నారు. ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ, నిరుద్యోగ సమస్య, విద్యారంగంలో నెలకొన్న సమస్యలు, ఉపాధి అవకాశాలు, యువతకు మెరుగైన ఉద్యోగ అవకాశాల కల్పన తదితర అంశాలపై వారి అభిప్రాయాలను సేకరించారు.
పట్టభద్రుల సమస్యలను నేరుగా తెలుసుకొని వారి గొంతుకగా నిలవడమే గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్ ప్రధాన ఉద్దేశమని జనసేన నాయకులు పేర్కొన్నారు. పట్టభద్రుల ఆకాంక్షలు, హక్కులు, సమస్యలను సంబంధిత వేదికలపై బలంగా ప్రస్తావించేందుకు ఈ కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు.
ప్రతి పట్టభద్రుడి అభిప్రాయాన్ని నమోదు చేసుకుంటూ, నిరుద్యోగ యువత ఎదుర్కొంటున్న ఇబ్బందులను వెలుగులోకి తీసుకువచ్చే దిశగా గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్ ముందుకు సాగుతోందన్నారు.
ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ పాలేరు నియోజకవర్గ నాయకులు గంజి ఉదయ్ కుమార్, ఎలగందుల సత్యనారాయణ, శ్రావణ్, పులిపాటి సుదర్శన్, హరీష్ తదితరులు పాల్గొన్నారు.

పట్టభద్రుల సమస్యలపై జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్
RELATED ARTICLES

