ములుగు జిల్లా ప్రతినిధి (ప్రజావాణి)
సోమవారం ములుగు జిల్లా సమీకృత కలెక్టరేట్లో సందడి వేరేగా ఉంది. ఎప్పుడూ పెద్దలతో నిండే కలెక్టరేట్ ఈ రోజు చిన్నారులతో కళకళలాడింది.
తెలంగాణ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ ఆదేశాల మేరకు, మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో, యూనిసెఫ్ భాగస్వామ్యంతో ‘పిల్లల ప్రజావాణి’ కార్యక్రమం ఘనంగా జరిగింది.
“నా రోజు.. నా హక్కులు.. నా భవిష్యత్” అనే నినాదంతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పిల్లలే హీరోలు.
జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు స్వయంగా విద్యార్థుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. చిన్న చేతులతో ఇచ్చిన ఆ దరఖాస్తులను ఎంతో ఆప్యాయంగా అందుకున్నారు. ప్రతి చిన్నారి మాటను ఓపికగా విన్నారు.
తమ బడి సమస్యలు, తమ ఊరి సమస్యలు, తమ హక్కుల గురించి పిల్లలు ధైర్యంగా చెప్పారు. కలెక్టర్ గారు ఒక్కో దరఖాస్తును చదివి, పరిష్కరిస్తామని భరోసా ఇచ్చారు.
పిల్లల గొంతు వినేందుకు, పిల్లల హక్కులను కాపాడేందుకు ఏర్పాటు చేసిన ఈ ప్రజావాణి… నిజంగా పిల్లల పండుగలా సాగింది.

