భక్తుల చిరకాల కోరిక నెరవేర్చండి.. ఎర్రగట్టు వెంకటేశ్వర స్వామి కోనేరుకు నిధులు మంజూరు చేయండి!
పురాతన మెట్లబావికి పూర్వ వైభవం తీసుకురావాలి
జీడబ్ల్యూఎంసీ కమిషనర్‌కు జన్ను కిషన్ కుమార్ వినతి.. అధికారుల తక్షణ చర్యలకు విజ్ఞప్తి
మన ప్రజవాణి,హసన్‌పర్తి, నవంబర్ 16:
హనుమకొండ జిల్లా గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని శ్రీ ఎర్రగట్టు వెంకటేశ్వర స్వామి దేవస్థానానికి చెందిన పురాతన కోనేరు (మెట్లబావి) అభివృద్ధికి నిధులు మంజూరు చేసి పూర్వ వైభవం తీసుకురావాలని జన్ను కిషన్ కుమార్ జీడబ్ల్యూఎంసీ కమిషనర్‌కు గ్రీవెన్స్ సెల్ ద్వారా వినతిపత్రం అందజేశారు. వేలాది మంది భక్తుల మనోభావాలు, ప్రజాప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని కోనేరు పునరుద్ధరణకు తక్షణమే చర్యలు చేపట్టాలని కోరారు.
ఈ సందర్భంగా జన్ను కిషన్ కుమార్ మాట్లాడుతూ.. గతంలో మార్చి 23, 2026న హనుమకొండ జిల్లా కలెక్టర్‌కు గ్రీవెన్స్ సెల్ ద్వారా పురాతన కోనేరు పరిరక్షణ, అభివృద్ధి కోసం వినతిపత్రం అందజేసినట్లు తెలిపారు. జిల్లా కలెక్టర్ ఆ వినతిని జీడబ్ల్యూఎంసీ అధికారులకు పంపించడంతో అధికారులు స్పందించి క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టారని వివరించారు.
అధికారులు చంద్రకళ ఏఈతో పాటు సంబంధిత సిబ్బంది అశోక్, సురేందర్ క్షేత్రస్థాయికి చేరుకొని కోనేరును పరిశీలించి, చెట్ల పొదలను తొలగించి ఆక్రమణలకు గురికాకుండా తక్షణ చర్యలు తీసుకోవడం అభినందనీయమన్నారు. అధికారుల చొరవతో దేవస్థానానికి చెందిన పురాతన కోనేరు అన్యాక్రాంతం కాకుండా పరిరక్షించబడిందని కృతజ్ఞతలు తెలిపారు.
కోనేరు పునరుద్ధరణతో భక్తులకు ఎంతో మేలు
ఎన్నో సంవత్సరాలుగా నిర్లక్ష్యానికి గురైన ఈ పురాతన కోనేరు పూడికతో నిండిపోయి, భక్తులు స్నానాలు ఆచరించేందుకు వీలులేని పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి సంవత్సరం హోలీ పౌర్ణమి నుంచి ఐదు రోజుల పాటు జరిగే శ్రీ ఎర్రగట్టు వెంకటేశ్వర స్వామి మహాజాతరకు వేలాది మంది భక్తులు తరలివస్తారని, ఈ నేపథ్యంలో కోనేరు అభివృద్ధి ఎంతో అవసరమని పేర్కొన్నారు.
అంచనాలు రూపొందించి నిధులు మంజూరు చేయాలి
జీడబ్ల్యూఎంసీ ఇంజనీరింగ్ అధికారులు కోనేరును క్షేత్రస్థాయిలో పరిశీలించి, పూడికతీత పనులతో పాటు అవసరమైన మరమ్మతులు, పునర్నిర్మాణ పనులకు సమగ్ర అంచనాలు (ఎస్టిమేట్) రూపొందించాలని కోరారు. అనంతరం అవసరమైన నిధులు మంజూరు చేసి పనులు ప్రారంభించాలని కమిషనర్‌కు విజ్ఞప్తి చేశారు.
పురాతన కోనేరు పునరుద్ధరణ జరిగితే మహాజాతరకు వచ్చే వేలాది మంది భక్తులకు స్నాన సౌకర్యం కలగడమే కాకుండా దేవస్థానం పవిత్రత, చారిత్రక ప్రాధాన్యత కూడా మరింత పెరుగుతాయని తెలిపారు. ఇది కేవలం దేవస్థానానికి సంబంధించిన అంశమే కాకుండా వేలాది మంది భక్తులకు, ప్రజలకు ఉపయోగపడే ప్రజాప్రయోజన కార్యక్రమమని స్పష్టం చేశారు.
భక్తుల ఆకాంక్షను నెరవేర్చాలి
ఇప్పటికే కోనేరు ఆక్రమణకు గురికాకుండా అధికారులు తీసుకున్న చర్యలు అభినందనీయమని, అదే విధంగా కోనేరు పూర్తిస్థాయి అభివృద్ధికి కూడా ప్రత్యేక శ్రద్ధ చూపాలని కోరారు. భక్తుల చిరకాల ఆకాంక్షను నెరవేర్చేలా కమిషనర్ స్పందించి నిధులు మంజూరు చేయాలని జన్ను కిషన్ కుమార్ విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో ఇమ్మడి కర్ణాకర్, జన్ను యువరాజ్ పాల్గొన్నారు.

