“పేదవాడి సొంతింటి కలను సాకారం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం*
*298వ డివిజన్ కాంగ్రెస్ అధ్యక్షుడు రొయ్యపల్లి మల్లేష్ గౌడ్*
మేడ్చల్: పేద, మధ్యతరగతి కుటుంబాల సొంతింటి కలను సాకారం చేయడమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని అమలు చేస్తోందని 298వ డివిజన్ పూడూర్–కిష్టాపూర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రొయ్యపల్లి మల్లేష్ గౌడ్ అన్నారు. ఇందిరమ్మ రాజ్యంలో ప్రతి పేద కుటుంబానికి సొంతింటి సౌభాగ్యం కల్పించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 298వ డివిజన్ పూడూర్–కిష్టాపూర్ పరిధిలో ఉన్న కిష్టాపూర్ గ్రామానికి చెందిన లబ్ధిదారులు తుడుం అమృత, అశోక్ దంపతుల నూతన గృహప్రవేశ కార్యక్రమానికి రొయ్యపల్లి మల్లేష్ గౌడ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన తన చేతుల మీదుగా నూతన గృహాన్ని ప్రారంభించి, గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొని లబ్ధిదారుల కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరికీ సొంత ఇల్లు ఉండాలన్నది పేద ప్రజల చిరకాల స్వప్నమని, ఆ కలను నిజం చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తోందని అన్నారు. నిరుపేద కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పిస్తూ, గౌరవప్రదమైన జీవనం అందించాలనే ఉద్దేశంతో ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తోందని తెలిపారు. సొంతింటిని నిర్మించుకోవడం అనేది ప్రతి కుటుంబానికి ఎంతో ఆనందాన్ని, ఆత్మగౌరవాన్ని అందించే విషయమని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేస్తోందని తెలిపారు. పేదల సంక్షేమం, అభివృద్ధి, సామాజిక న్యాయం కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన ధ్యేయాలని అన్నారు. అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రజలకు అండగా నిలవాలని పిలుపునిచ్చారు. తుడుం అమృత, అశోక్ దంపతులు నూతన గృహంలో సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో జీవించాలని ఈ సందర్భంగా మల్లేష్ గౌడ్ ఆకాంక్షించారు. సొంతింటి కల నెరవేరిన కుటుంబంలో ఆనందం వెల్లివిరియడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అధికార ప్రతినిధి ఉదండాపురం సత్యనారాయణ, జిల్లా ఉపాధ్యక్షుడు జి. బాల్ రెడ్డి, మార్కెట్ కమిటీ డైరెక్టర్ రేగు రాజు, సీనియర్ నాయకులు సత్తిరెడ్డి, హనుమంత్ రెడ్డి, యాదయ్య, నారెడ్డి కొండల్ రెడ్డి, ఘర్డాస్ నరేందర్, రంజిత్ తదితర కాంగ్రెస్ పార్టీ నాయకులు, అనుబంధ సంఘాల నాయకులు పాల్గొన్నారు.

