📄 ePaper
5pm
7pm
Tuesday, November 17, 2026
📄 ePaper
5pm epaper
7pm epaper
Homeతెలంగాణనకిలీ 'నూనె' మాయాజాలం.. బయటి ఊర్లకూ పార్శిల్ దందా

నకిలీ ‘నూనె’ మాయాజాలం.. బయటి ఊర్లకూ పార్శిల్ దందా

📰 Generate e-Paper Clip

నకిలీ ‘నూనె’ మాయాజాలం.. బయటి ఊర్లకూ పార్శిల్ దందా!

* వెంకటాపురం కేంద్రంగా ‘పొన్నూస్వామి నూనె మందుల’ అక్రమ సరఫరా

* రవాణా సంస్థల ద్వారా పొరుగు ప్రాంతాలకు రహస్యంగా పార్శిళ్లు?

* చేతికొచ్చే పంటలను ఆగం చేస్తున్న నకిలీ తైలాలు.. కఠిన చర్యలకు రైతుల డిమాండ్

వెంకటాపురం (నూగురు), నవంబరు 16 (ప్రజావాణి): అప్పులు తెచ్చి, ఆరుగాలం శ్రమించి పంటలు సాగు చేస్తున్న ఏజెన్సీ రైతాంగం అమాయకత్వమే కొందరు అక్రమ వ్యాపారులకు కాసుల వర్షం కురిపిస్తోంది. ములుగు జిల్లా వెంకటాపురం మండలంలో ప్రస్తుతం ‘పొన్నూస్వామి నూనె మందులు’ పేరిట సాగుతున్న నయా వ్యాపారం అన్నదాతల పాలిట శాపంగా మారింది. ఎలాంటి శాస్త్రీయ ప్రమాణాలు, ప్రభుత్వ అనుమతులు లేని ఈ ద్రవ రూప మందులను కేవలం స్థానికంగానే కాకుండా, వెంకటాపురం కేంద్రంగా ఇతర ప్రాంతాలకు (బయటి ఊర్లకు) సైతం పార్శిల్ రూపంలో రహస్యంగా సరఫరా చేస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
పార్శిళ్ల రూపంలో బయటి ప్రాంతాలకు తరలింపు..
క్షేత్రస్థాయిలో రైతులు, స్థానిక ప్రజాసంఘాలు చెబుతున్న వివరాల ప్రకారం.. తెగుళ్ల బారి నుండి మిర్చి, పత్తి తోటలను కాపాడుకునేందుకు రైతులు పడుతున్న ఆరాటాన్ని ఓ వ్యాపారి తనకు అనుకూలంగా మార్చుకున్నారు. ఈ ‘పొన్నూస్వామి నూనె మందులు’ పిచికారీ చేస్తే చాలు.. ఎలాంటి తెగుళ్లైనా మాయమై, రెట్టింపు దిగుబడి వస్తుందని అబద్ధపు ప్రచారాలు చేస్తూ ఒక్కో సీసాకు వందల రూపాయలు వసూలు చేస్తున్నారు. ఇక్కడ దందాపై నిఘా పెరుగుతుందనే ఉద్దేశంతో, స్థానికంగా ఉన్న ఓ ప్రముఖ రవాణా (పార్శిల్) సర్వీసు కేంద్రం ద్వారా పొరుగు మండలాలు, ఇతర ఊర్లకు కూడా బాక్సుల కొద్దీ పార్శిళ్లు పంపిస్తూ దందాను విస్తరిస్తున్నట్లు సమాచారం.
పచ్చని పంటలపై విష ప్రయోగం.. నిఘా నేత్రం నిద్రపోతోందా?
మాయమాటలను గుడ్డిగా నమ్మిన రైతులు, తమ పంటలపై వీటిని పిచికారీ చేసి నిలువునా మోసపోతున్నారు. మందు కొట్టిన కొద్దిరోజులకే మొక్కలు జీవం కోల్పోయి మాడిపోవడం, పూత రాలిపోవడం జరుగుతోందని బాధిత రైతులు కన్నీటిపర్యంతమవుతున్నారు. కేంద్ర కీటకనాశని బోర్డు (సీఐబీ) నిబంధనల ప్రకారం ఎలాంటి లైసెన్సులు లేకుండా ఇటువంటి మందుల విక్రయాలు, రవాణా చేయడం చట్టరీత్యా తీవ్రమైన నేరం. ఇప్పటికైనా జిల్లా వ్యవసాయ శాఖ, విజిలెన్స్ విభాగం అధికారులు నిద్రమత్తు వీడి, స్థానిక నిల్వ కేంద్రాలతో పాటు రవాణా అవుతున్న పార్శిళ్లపైనా ఆకస్మిక దాడులు నిర్వహించాలని, రైతుల జీవితాలతో ఆడుకుంటున్న సదరు వ్యాపారిపై కఠిన చర్యలు తీసుకోవాలని మండల ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.